: పన్నుల్లో కోత, పెద్ద నోట్ల రద్దు పట్ల గవర్నర్ వద్ద ఆందోళన వ్యక్తం చేసిన కేసీఆర్

పెద్ద నోట్ల రద్దు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే నిధుల్లో కోత విధించడం లాంటి విషయాల పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోతుందని ఆయన భావిస్తున్నారు. నిన్న సాయంత్రం గవర్నర్ నరసింహన్ తో ఆయన భేటీ అయ్యారు. దాదాపు నాలుగు గంటలపాటు గవర్నర్ తో ఆయన సుదీర్ఘ చర్చలు జరిపారు. కేంద్రం నిర్ణయాలతో నెలకు రూ. 2 వేల కోట్లకు పైగా (ఏడాదికి సుమారు రూ. 25 వేల కోట్లు) తెలంగాణ ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని గవర్నర్ కు ఆయన తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. పెద్ద నోట్ల రద్దుతో భూముల రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఈ సందర్భంగా గవర్నర్ కు ముఖ్యమంత్రి తెలిపారు. నగదు రూపంలోని లావాదేవీలన్నింటిపై నోట్ల రద్దు ప్రభావం ఉంటుందని వివరించారు. రిజిస్ట్రేషన్లు, వాహనాలు, గృహోపకరణాల కొనుగోళ్లు స్తంభించిపోతాయని... గణాంకాలతో సహా గవర్నర్ కు కేసీఆర్ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజు 3000 రిజిస్ట్రేషన్లు జరుగుతాయని... దానిపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. నోట్ల రద్దుతో బుధవారం కేవలం 150, గురువారం 300 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయని తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్లతో నెలకు సగటున రూ. 320 కోట్ల ఆదాయం ఖజానాకు చేరుతోందని... ఆ ఆదాయం ఇప్పుడు 90 శాతం పడిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజు 3 వేలకు పైగా వాహనాల అమ్మకాలు జరుగుతాయని.. ఇప్పుడు ఇది కూడా దారుణంగా పడిపోతుందని చెప్పారు.

More Telugu News