: కృష్ణా, గుంటూరు జిల్లాలను కుదిపేసిన నోట్ల రద్దు.. నిలిచిపోయిన ఆర్థిక లావాదేవీలు

పెద్ద నోట్ల రద్దు ప్రభావం కృష్ణా, గుంటూరు జిల్లాలను కుదిపేసింది. నూతన రాజధాని పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైన నిర్మాణ ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, రాజధాని రాక కారణంగా ప్రజల్లో పెరిగిన లావాదేవీలపై నోట్ల రద్దు పెను ప్రభావాన్ని చూపించింది. మరి కొన్ని రోజుల పాటు ఆర్థిక లావాదేవీలు ఈ ప్రాంతంలో పూర్తిగా నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ జరిగే లావాదేవీలు భిన్నంగా ఉంటాయి. ఇతర జిల్లాల్లో లక్ష రూపాయల లావాదేవీలు జరిగితే ఇక్కడ కోట్ల రూపాయల్లో జరుగుతుంటాయి. ఇంతటి భారీ స్థాయిలో నగదు మళ్లీ చేతికి రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అంతేకాదు, ఇప్పటికిప్పుడు ఉన్న నోట్లు చెల్లకపోవడంతో నిన్నమొన్నటి వరకు జోరుగా సాగిన నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలయ్యే ప్రమాదం కూడా ఉంది. కొత్త నగదు వచ్చే వరకు అవి పూర్తిగా ఆగిపోక తప్పదు. అప్పటి వరకు ఆగితే నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయే ప్రమాదముంది. అంతేకాదు ఇప్పటి వరకు ఆకాశాన్నంటిన భూముల ధరలు కూడా పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భూ లావాదేవీలు జరపడం పెద్ద సవాల్ లాంటిదే.

More Telugu News