: ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ పెద్దనోట్ల రద్దు.. విదేశాల్లోనూ ఇదే తీరు

దేశంలో ప్రకంపనలు సృష్టించిన పెద్దనోట్ల రద్దు ఇదే మొదటిసారి ఏమీ కాదు. గతంలోనూ ఇలా పెద్ద నోట్లను రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. నల్లధనం నియంత్రణకు దేశంలోని గత ప్రభుత్వాలు కూడా అప్పట్లో పెద్ద నోట్లను రద్దు చేశాయి. అయితే ఇప్పట్లా రూ.1000, రూ.500 నోట్లు కాదు ఏకంగా రూ.5 వేలు, రూ.10 వేల నోట్లనే రద్దు చేశారు. 2014లో ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన వెలువడింది. 2005కి ముందు ముద్రించిన రూ.500, రూ.1000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాల్సిందిగా ప్రభుత్వం ప్రజలను కోరింది. కానీ రద్దు చేయలేదు. అప్పుడు కూడా పది నోట్ల కన్నా ఎక్కువ నోట్లను మార్చాల్సి వస్తే ఆ వ్యక్తుల వివరాలను సేకరించారు. దీంతో కొంతమాత్రమే నల్లధనం బయటకు వచ్చింది. స్వాతంత్ర్యం రాకముందు మన దేశంలో రూ.1000, రూ.10,000 నోట్లు ఉండేవి. జనవరి, 1946లో వెయ్యి నోటును రద్దు చేశారు. అంతకు చాలా సంవత్సరాల క్రితమే అంటే 1938లో రూ.10 వేల నోటును రద్దు చేశారు. అయితే 1954లో తిరిగి అందుబాటులోకి తెచ్చారు. ఆ సమయంలో రూ.5 వేల నోటును కూడా ప్రవేశపెట్టారు. ఈ నోట్ల కారణంగా నల్లధనం పెరిగిపోతోందని భావించిన ప్రభుత్వం ఆ తర్వాత 1978లో రూ.వెయ్యి, అంతకు మించి చలామణిలో ఉన్న అన్ని పెద్ద నోట్లను రద్దు చేసింది. అయితే, తిరిగి వెయ్యి రూపాయల నోటును 2000 సంవత్సరంలో అందుబాటులోకి తెచ్చింది. నల్లధన నియంత్రణకు పెద్ద నోట్లను రద్దు చేయడం ఒక్క భారత్‌కే పరిమితం కాలేదు. కరెన్సీ మార్పు కోసం అంటూ చాలా దేశాలు తమ కరెన్సీని రద్దు చేశాయి. 2012లో లిబియా పాత నోట్లను విత్‌డ్రా చేసుకుంది. యూరోపియన్ యూనియన్ కోసం ఒకే కరెన్సీని అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. 1998-2000లో ఈయూ దేశాల కరెన్సీలను రద్దు చేసి కొత్త వాటిని విడుదల చేశారు. చరిత్రలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద కరెన్సీ రద్దు. ఇంకా మెక్సికో, అర్జెంటీనా, నేపాల్, టర్కీ, ఇజ్రయెల్, జర్మనీ తదితర దేశాలు కూడా నోట్లను రద్దు చేశాయి. వంద యూరో నోటును రద్దు చేయాలన్న డిమాండ్ అమెరికాలోనూ కొన్నాళ్లుగా వినిపిస్తోంది.

More Telugu News