: చిల్లర అవస్థలు... వంద పోయినా ఫర్లేదు... నాలుగొందలు చాలంటున్న ప్రజలు!

విజయవాడ రైల్వేస్టేషన్... నిత్యమూ లక్షమందిని తమతమ గమ్యస్థానాలకు చేరుస్తూ బిజీగా ఉంటుంది. ఈ ఉదయం రైల్వే స్టేషన్ లో కొత్త సమస్య ఎదురైంది. అదే చిల్లర అవస్థ. రూ. 500, రూ. 1000 నోట్లు చెల్లవన్న నిర్ణయం నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి రైల్వే కౌంటర్లలో ఈ నోట్లను తీసుకోవాలన్న ఆదేశాలు ఉన్నాయి. అయితే, ఓ యాభై లేదా వంద రూపాయల టికెట్ ఖరీదు చేస్తే, ఇవ్వాల్సిన మిగతా చిల్లర తమ వద్ద లేదని, చిల్లర ఇస్తేనే టికెట్ ఇస్తామని కౌంటర్లలోని సిబ్బంది స్పష్టం చేస్తుండటంతో ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి. బయటకు వెళితే, ఏ ఒక్కరూ ఆ నోట్లను తీసుకునేందుకు సిద్ధంగా లేరు. దీంతో విజయవాడ రైల్వే స్టేషన్ లో తీవ్ర గందరగోళం ఏర్పడటంతో, అధికారులు స్పందించి కౌంటర్ల సిబ్బందికి వంద రూపాయల బండిల్స్ కొన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ఎంతో మంది క్యూలో నిలబడి, వరంగల్ కు రూ. 90 పెట్టి టికెట్ కొని రూ. 400 చిల్లర తీసుకుని ఆ టికెట్ చించి పడేసి తిరిగి క్యూలోకి వెళ్లి 400 రూపాయల చిల్లర కోసం మరో టికెట్ కొంటున్న పరిస్థితి. బయటకు వెళితే 500 రూపాయల నోట్లను ఎవరూ తీసుకోవడం లేదని, అందువల్లే ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. ఒక్క విజయవాడలోనే కాదు, అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇదే విధమైన పరిస్థితి నెలకొంది.

More Telugu News