: ‘నా పోరాటం ఫలించింది’.. ప్రధాని నిర్ణయంపై చంద్రబాబు హర్షం

నల్లధనాన్ని నిర్మూలించేందుకు ప్రధాని తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. ఇదో చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థగా నల్లధనం విస్తరించడానికి పెద్దనోట్లే కారణమని పేర్కొన్నారు. నల్లధనం వల్ల ద్రవ్యోల్బణంతోపాటు రాజకీయ రంగం, పాలనా రంగాల్లో అవినీతి పెద్ద ఎత్తున పెరిగిపోయిందన్నారు. వీటి రద్దు వల్ల ఇక నుంచి అలా జరిగే పరిస్థితి ఉండదన్నారు. వెయ్యి రూపాయల నోట్లను దాచినంత తేలిగ్గా రూ.100 నోట్లను దాచలేరని, అందుకే చాలా కాలంగా పెద్ద నోట్లను రద్దు చేయాలని పోరాడుతున్నట్టు చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో చేపట్టే సంస్కరణల్లో రూ.5 వేలకు పైబడిన లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానో, కార్డుల ద్వారానో జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని నిర్ణయం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. డబ్బు పిచ్చికి ఇక బ్రేకులు పడతాయని పేర్కొన్న చంద్రబాబు రాజకీయాల్లో డబ్బు ప్రభావం తగ్గుతుందని, దీని కోసమే ఇంతకాలం పోరాడామని వివరించారు.

More Telugu News