: విచిత్రం.. ఆ కాలనీలోని ఇళ్లకు 500 ఏళ్ల నుంచి అద్దె పెంచలేదు!

మామూలుగా ఇంటి అద్దెలను కాలాన్ని బట్టి పెంచుతూ వెళ‌తారు. ఆరునెల‌లకో, సంవ‌త్స‌రానికో య‌జ‌మానులు అద్దెలు పెంచేస్తారు. అయితే, జర్మనీలోని ఆగ్స్‌బర్గ్‌ పట్టణంలో ఫుగ్గెరీ అనే గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలో ఇంటి అద్దెల ప‌రిస్థితి విచిత్రంగా ఉంది. ఐదు వంద‌ల ఏళ్ల క్రితం ఇంటికి ఎంత అద్దె చెల్లించేవారో ఇప్పుడు కూడా అంతే చెల్లిస్తున్నారు. ఆ కాల‌నీలో మొత్తం 52 ఇళ్లు ఉన్నాయి. ఒక్కో ఇంటి అద్దె ఐదు వంద‌ల ఏళ్ల క్రితం 88 యూరో సెంట్లు (సుమారు రూ. 65) ఉండేది. ఇప్పుడు వెళ్లి చూసినా ఆ కాల‌నీలో ఇళ్ల‌కు ఇంతే అద్దె క‌డుతూ క‌నిపిస్తారు. దీనికి పెద్ద కార‌ణ‌మే ఉంది. ఆ కాల‌నీని జాకబ్‌ ఫుగ్గర్ అనే ధ‌న‌వంతుడు 1517లో నిరుపేద కార్మికుల కోసం నిర్మించాడు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పడకగది, వంటగది వసతులతో పాటు లాన్‌ కూడా ఉండేలా ఇళ్ల‌ను నిర్మించాడు. 1523 నుంచి ఈ కాల‌నీలోని ఇళ్ల‌ను పేదలకు ఏడాదికి 88 యూరో సెంట్లకే అద్దెకు ఇవ్వ‌డం ప్రారంభించాడు. అంతేకాదు, ఆ కాలనీ నిర్వహణ కోసం బ్యాంకులో కొంత డ‌బ్బును కూడా డిపాజిట్‌ చేశాడు. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం ఆయన వారసులు కూడా ఆయ‌నలాగే మంచి హృదయంతో పేద‌ల‌కు సాయ‌ప‌డ్డారు. వారికి చెందిన స్వచ్ఛంద సంస్థ ఆ ఇళ్లకు అద్దె పెంచకూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఫుగ్గెరీ అప్ప‌ట్లో బ్యాంకులో డిపాజిట్‌ చేసిన డబ్బుకు ఇప్ప‌టికీ వడ్డీ వ‌స్తోంది, దానితో పాటు స్థానిక అడవుల్ని పరిరక్షిస్తున్నందుకు అక్క‌డి స‌ర్కారు వారికి ఇచ్చే పారితోషికం, దాతల నుంచి సేక‌రించే విరాళాలతో వారు ఈ కాల‌నీ బాగోగుల‌ను చూసుకుంటున్నారు. అయితే, ఇక్కడో విషయం వుంది. ఆ కాలనీలో అద్దెకు ఉండాలంటే ప‌లు అర్హ‌త‌లు క‌లిగి ఉండాలి. వారు నిరుపేదలై, రెండేళ్ల స్థానికత కలిగి ఉండాలి. ఇంట్లో అద్దెకు దిగిన త‌రువాత వారు రోజుకు మూడు సార్లు దైవ ప్రార్థన చేయాలి. ఈ కాల‌నీ గేట్ల‌ను ప్ర‌తిరోజు రాత్రి పది దాటగానే మూసివేస్తారు. అంతేగాక‌, ఈ కాల‌నీ ఓ పర్యాటక ప్రాంతంగానూ మారింది. కానీ, కాలనీలోకి ప‌ర్యాట‌కుల‌ను రానివ్వరు. ఈ కాల‌నీ గురించి తెలిసేలా అక్క‌డే మరో నకిలీ కాలనీని నిర్మించారు. అక్క‌డ‌కు వ‌చ్చే పర్యాటకులు ఆ న‌కిలీ కాల‌నీని చూసి వెళుతుంటారు.

More Telugu News