: టూరిస్టు స్పాట్‌గా భోపాల్ ఎన్‌కౌంటర్ ప్రాంతం.. చూసేందుకు పోటెత్తుతున్న జనాలు!

భోపాల్ సెంట్రల్ జైలు నుంచి ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు తప్పించుకుని పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్ అయిన సంగతి తెలిసిందే. ఎన్‌కౌంటర్ జరిగిన ఖెజ్రాడియో గ్రామంలోని మనిఖేడి పహాడీ ప్రాంతం ఇప్పుడు టూరిస్టు స్పాట్‌గా మారిపోయింది. ఆ ప్రాంతాన్ని చూసేందుకు స్థానికులే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. చిన్నారులను సైతం తమతో పాటు తీసుకొచ్చి చూపిస్తుండడం గమనార్హం. ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న ఉగ్రవాదుల చినిగిన దుస్తులు, ఎండిన రక్తపు మరకల వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ ప్రాంతాన్ని ఎందుకలా వదిలేశారని అదనపు ఎస్పీ ధర్మవీర్‌ను ప్రశ్నించగా సాక్ష్యాలు పూర్తిగా సేకరించామని, రక్తపు మరకలు మాత్రమే మిగిలిపోయాయని పేర్కొన్నారు. కాగా జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులను పోలీసుల కంటే ముందు తామే చూశామని అక్కడికొచ్చిన చాలామంది చెబుతున్నారు. సంతోష్ అనే ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. సోమవారం పోలీసులు రావడానికి ముందే గ్రామస్తులు ఉగ్రవాదులను చుట్టుముట్టారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌కు ముందు ఓ ఉగ్రవాది మాట్లాడుతూ ‘‘మేం ఏం చేయాలో అది చేశాం. ఇప్పుడు మమ్మల్ని చంపుతామన్నా మాకు భయం లేదు’’ అని వ్యాఖ్యానించాడు.

More Telugu News