: సైరస్ మిస్త్రీని రాజీనామా చేయమన్నది రతన్ టాటానే... చేయకపోతే ఏమవుతుందో కూడా చెప్పారట...

టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని అనూహ్యంగా తొలగించడం పారిశ్రామిక వర్గాలనే కాకుండా సామాన్యులను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే, దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. వాస్తవానికి, సైరస్ మిస్త్రీని రాజీనామా చేయాలని కోరింది రతన్ టాటానే అట. మిస్త్రీని తొలగించే ముందే... రతన్ టాటా అతడిని స్వయంగా కలసి ఛైర్మన్ పదవికి రిజైన్ చేయాలని కోరారట. చేయకపోతే, జరగబోయే పరిణామాలను కూడా క్లియర్ గా చెప్పారట. టాటా సన్నిహితులు వెల్లడించిన దాని ప్రకారం, బ్రిటన్ లో ఉన్న టాటా స్టీల్ కంపెనీని అమ్మేయాలని మిస్త్రీ నిర్ణయించడం... రతన్ టాటాను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఓ వైపు యూరప్ లో వ్యాపారాన్ని విస్తరించాలని టాటా భావిస్తుంటే, అక్కడున్న ప్రధానమైన సంస్థను మిస్త్రీ అమ్మాలనుకోవడం టాటాను బాధించింది. టాటా గ్రూప్ కు రూ. 3 వేల కోట్ల రుణభారం ఉన్న సంగతి టాటాకు తెలుసని... అయితే, దీనికోసం కంపెనీ రత్నాలను అమ్మేయాలనుకున్న నిర్ణయం టాటాకు ఏమాత్రం ఇష్టం లేదని ప్రముఖ లాయర్ మోహన్ పరాశరన్ తెలిపారు. మరో విషయం ఏమిటంటే, మిస్త్రీని మార్చేయాలనే సలహాను రతన్ టాటాకు ఇచ్చిన ముగ్గురిలో పరాశరన్ కూడా ఒకరు. మిస్త్రీని తొలగించడానికి నెల రోజుల ముందు అతడిని టాటా కలసినందున, నెల రోజుల ముందే నోటీసు ఇచ్చినట్టు అవుతుందని పరాశరన్ అన్నారు. అంతేకాదు, బోర్డులో రతన్ టాటాకు మెజారిటీ ఉన్నందున మిస్త్రీ తొలగింపు చట్టబద్ధం అవుతుందని ఆయన తెలిపారు. మరోవైపు, తనకు చట్టపరంగా ఇవ్వాల్సిన 15 రోజుల నోటీసును ఇవ్వలేదని మిస్త్రీ ఆరోపిస్తుండటం గమనార్హం.

More Telugu News