: ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు సింహాచలం.. తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లిన కొడుకు కానిస్టేబుల్

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు సింహాచలం అలియాస్ మురళి, అలియాస్ హరి రెండున్నర దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో ఉన్నారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ప్రస్తుతం డివిజన్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. మొన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో మావోయిస్టుల మృతదేహాలను భద్రపరిచిన సంగతి తెలిసిందే. దీంతో తండ్రి సింహాచలం మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆయన కుమారుడు అప్పారావు అక్కడికి చేరుకున్నారు. కాగా అప్పారావు పోలీస్ కానిస్టేబుల్ కావడం గమనార్హం. విజయనగరం జిల్లాలోని గరివిడి పోలీస్ స్టేషన్‌లో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్నప్పుడే కుటుంబాన్ని విడిచి వెళ్లిన తండ్రి విగతజీవుడుగా కనిపించడంతో అప్పారావు చలించిపోయారు. కన్నీరు పెట్టుకున్నారు. 1991లో మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన సింహాచలానికి మావోయిస్టు అగ్రనేత గంటి ప్రసాదంతో మంచి సంబంధాలు ఉండేవి. ఆయనతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రసాదం మరణం తర్వాత బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయిన సింహాచలం ఇటీవలే డివిజన్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. పార్టీ కోసం కుటుంబానికి దూరమైన ఆయన ఇటీవల జరిగిన కుమార్తె వివాహానికి కూడా హాజరుకాలేదు. ఆయన కుమారుల్లో ఒకరైన అప్పారావు కానిస్టేబుల్ కాగా, మరొకరు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నారు.

More Telugu News