: న్యూయార్క్ డిన్నర్ లో ఒకరిపై ఒకరు కుళ్లు జోకులు వేసుకున్న హిల్లరీ, ట్రంప్!

వచ్చే నెల 8న జరగనున్న అమెరికా ఎన్నికల్లో తలపడుతున్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ లు తుది బిగ్ డిబేట్ ముగిసిన 24 గంటల్లోపే మరోసారి కలుసుకున్నారు. న్యూయార్క్ చారిటీ డిన్నర్ వేదికగా కలిసిన ఇద్దరు నేతలూ ఎడమొహం పెడమొహంగానే ఉన్నప్పటికీ, ఒకరిపై ఒకరు కుళ్లు జోకులు వేసుకున్నట్టు తెలుస్తోంది. వాల్ డార్ఫ్, అస్టోరియా హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కార్డినల్ తిమోతీ దోలన్ కు చెరో వైపు కూర్చున్న ట్రంప్, హిల్లరీలు తొలుత ఒకరిని ఒకరు చూసేందుకు, పలకరించుకునేందుకు ఇష్టపడలేదు. ఆపై ముక్తసరిగా చేతులు కలిపారు. తొలుత తనను తాను గొప్పగా చెప్పుకుంటూ ట్రంప్ మాటలు మొదలు పెట్టారు. "కొంత మంది నాకన్నా ఘటికులని అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి నేను నిరాడంబరుడిని. ఇదే మంచి లక్షణమని చాలా మంది నాతో చెప్పారు. నా టెంపర్ మెంట్ కన్నా నిరాడంబరతే ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడామె ప్రజల్లో ఉంది. కాథలిక్కులకు వ్యతిరేకం కాదని చెప్పడమే ఆమె ఉద్దేశం" అంటూ కాథలిక్కులు, ఇవాంజలిక్స్ ను ప్రస్తావిస్తూ, క్లింటన్ అనుయాయులు జోకులు వేసుకున్నారని వెల్లడైన వికీలీక్స్ పత్రాలను ఆయన ప్రస్తావించారు. అంతటితో ఆగకుండా, గత రాత్రి నేను ఆమెను దుష్టురాలని సంబోధించాను. అది నిజం. ఆమె మాటలను పదే పదే విన్న తరువాత రోసీ ఓ డోన్నెల్ (టీవీ వ్యాఖ్యాత)ను నేను తప్పుగా అనుకోవడం లేదన్నారు. దీనిపై హిల్లరీ సైతం తనదైన శైలిలో స్పందించారు. తన బిజీ ప్రచార షెడ్యూల్ నుంచి కొంత బ్రేక్ తీసుకుని సేదదీరేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పిన ఆమె, ట్రంప్ మాట్లాడేటటువంటి మాటలు చెప్పాలంటే, తాను చాలా డబ్బు తీసుకుంటానని అన్నారు. ఆపై ట్రంప్ వైపు తిరిగి, "డొనాల్డ్, నేను చెప్పేది ఏదైనా నీకు నచ్చకుంటే, నా మాటలు పూర్తి అయిన తరువాత లేచి నిలబడి 'తప్పు' అని పెద్దగా అరువు" అని సలహా ఇచ్చారు. ఆపై ఎన్నికల్లో తాను ఓడిపోతే ఫలితాలను అంగీకరించబోనని చెప్పడాన్ని తప్పుబడుతూ, "ఈ వ్యాఖ్యలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ఎన్నికలు పారదర్శకంగా జరగడం ఆయనకు ఇష్టం లేనట్టుంది" అన్నారు. వీరి మధ్య జరిగిన సంభాషణ 3000 డాలర్లు కట్టి చారిటీ డిన్నర్ కు వచ్చిన 1500 మందిని నవ్వించింది.

More Telugu News