: లేచింది మహిళా లోకం.. డ్రగ్స్‌ మాఫియా, అక్రమ వ్యాపారాలు, దోపిడీలు మాయం!

మెక్సికోలో మ‌త్తు ప‌దార్థాల విక్ర‌యం, దోపిడీలు తారస్థాయిలో జ‌రుగుతాయ‌న్న విష‌యం తెలిసిందే. నేరాల రేటు గణనీయంగా ఉన్న ఆ దేశంలోని మిచోవాకాన్‌ రాష్ట్రంలో ఉన్న‌ చిరాన్‌ పట్టణంలో మ‌హిళా శ‌క్తి క‌దిలింది. అవినీతి, అక్ర‌మ వ్యాపారాల ప‌ట్ల పోరాటం చేసి, ఫ‌లితం సాధించింది. ఎటువంటి అక్ర‌మాల‌కు, హ‌త్య‌ల‌కు తావులేని ప్రశాంతమైన పట్టణంగా రూపొందించింది. ఒకప్పుడు మాఫియా సాగించే అక్ర‌మ‌ వ్యాపారాల‌కు, హ‌త్య‌ల‌కు కేంద్రంగా ఉండే ఆ ప‌ట్ట‌ణంలో ఇప్పుడు అటువంటి కార్య‌క్ర‌మాల‌కు చోటులేదు. టింబర్‌ మాఫియా ముఠాలు ఒక‌ప్పుడు ఆ ప్రాంతంలో అడవులను నరికి కలపను అక్రమంగా రవాణా చేస్తూ చ‌ట్ట‌వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డేవి. దీంతో కొన్ని రోజుల వ్య‌వ‌ధిలోనే ఏకంగా 42వేల ఎకరాల అడవిని న‌రికేశారు. అడ్డం వ‌చ్చిన వారిని దారుణంగా చంపేసేవారు. మాఫియా ఆగ‌డాలు అంత‌టితో ఆగ‌లేదు. ఆ ప్రాంతంలోని ప్రజలు, వ్యాపారుల వద్ద డ‌బ్బు, న‌గ‌దు లాక్కునేవారు. భ‌యం గుప్పిట బ‌తుకుతున్న ఆ ప్రాంతంలో వారి అక్ర‌మాల‌ను అణ‌చివేయ‌డానికి అక్క‌డి మ‌హిళ‌లు క‌దిలారు. వారిని తిప్పికొట్ట‌డానికి స్థానిక మహిళలు బృందంగా ఏర్పడ్డారు. అడవిలోకి అక్ర‌మంగా చొర‌బ‌డుతున్న టింబర్‌ మాఫియాను అడ్డుకోవాల‌నుకున్నారు. వారు కూడా అడ‌విలోకి వెళ్లే వారిని క‌ట్ట‌డి చేయాల‌ని చూశారు. అయితే, స్మగ్లర్లు మ‌హిళ‌ల‌పై ఎదురుదాడికి దిగారు. మొద‌ట మ‌హిళ‌లు అక్క‌డి నుంచి పారి పోయారు. అయిన‌ప్ప‌టికీ వెనక్కు తగ్గకుండా మ‌ళ్లీ వారిని అడ్డుకోవాల‌ని ప్ర‌ణాళిక రూపొందించుకున్నారు. మాఫియా కలపను తీసుకుని త‌మ‌ పట్టణం సమీపంలోకి రాగానే వారిని ప‌ట్టుకోవాల‌ని అనుకున్నారు. ఒకసారి త‌మ‌ సమీపంలోకి మాఫియా కలపతో రాగానే వారిని అడ్డుకున్నారు. అక్క‌డ ఉన్న‌ చర్చిలో గంటను మోగించి ప్రజలంద‌రినీ పిలిచారు. వెంట‌నే దూసుకొచ్చిన‌ మహిళలంతా కర్రలు, కత్తులతో స్మ‌గ్ల‌ర్ల‌ను బంధించారు. అయితే కొంత‌మంది పోలీసులు, రాజకీయ నాయకులు అక్కడికి వచ్చి స్మ‌గ్ల‌ర్ల‌ను విడిచిపెట్టాల‌ని అడిగారు. వారిపై కూడా ప్ర‌జ‌లంతా తిరగబడడంతో వారు ఏమీ చేయ‌లేక అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. స్మగ్లర్ల ప‌ట్ల సానుకూలంగా వ్య‌వ‌హరిస్తోన్న‌ పోలీసులను, రాజ‌కీయ నాయకులను ఇక‌పై త‌మ‌ పట్టణంలోకి రానివ్వ‌లేదు. స్వయంగా కౌన్సిల్‌ను సైతం ఏర్పాటు చేసుకున్నారు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని, ఎటువంటి దోపిడీ ఆ ప్రాంతంలో జ‌ర‌గ‌కుండా చూసుకుంటున్నారు. పర్యావరణానికి, అక్క‌డి ప్ర‌జ‌ల‌కు రక్షణ కల్పించేందుకు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పాల‌న కొన‌సాగిస్తున్నారు. స్మ‌గ్ల‌ర్ల కార‌ణంగా నాశ‌న‌మైన అడ‌విలో మ‌ళ్లీ చెట్లు నాటడం ప్రారంభించి ఐదేళ్లు కష్టపడ్డారు. అడ‌విలో లక్షలాది మొక్కలు నాటారు. ప్ర‌స్తుతం ఆ ప్రాంత‌మంతా ప‌చ్చ‌గా మ‌ళ్లీ పూర్వ వైభ‌వాన్ని సంత‌రించుకుంది. మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని వారు ఇంకా కొన‌సాగిస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసుకుని అక్ర‌మాల‌కు తావు లేకుండా చూస్తున్నారు. ప‌లు చ‌ర్య‌లు తీసుకొని నేరాలు లేకుండా చూస్తున్నారు. వారిలో వ‌చ్చిన చైత‌న్యంతో ఆ ప‌ట్ట‌ణంలో ఇప్పుడు నేరాలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. చిరాన్‌ పట్టణాన్ని ఇప్పుడు మెక్సికో ప్ర‌జ‌లు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు.

More Telugu News