: న్యూజిలాండ్ ఆలౌట్... టీమిండియా లక్ష్యం 191

టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టుపై ఆధిక్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుని ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన ధోనీ నమ్మకాన్ని బౌలర్లు నిలబెట్టారు. పటిష్టమైన న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ ను పదునైన బంతులతో కకావికలం చేశారు. ఓపెనర్ లాధమ్ సాహసోపేతమైన ఇన్నింగ్స్ ఆడగా, టెయిలెండర్లు బాగా రాణించడంతో 190 పరుగులు చేశారు. మొదట్లో డాషింగ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (12) ను హార్డిక్ పాండ్యా అవుట్ చేశాడు. ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (3) ను ఉమేష్ యాదవ్ పెవిలియన్ కు పంపగా, తరువాతి వికెట్ ను హార్డిక్ పాండ్యా తీశాడు. ఆ తరువాతి వికెట్ ను ఉమేష్ యాదవ్, తరువాత మళ్లీ హార్డిక్ పాండ్యా వీరిద్దరూ ఐదు వికెట్లు తీసిన అనంతరం, కేదార్ జాదవ్, అమిత్ మిశ్రా కివీస్ ఇన్నింగ్స్ ను శాసించారు. అయితే, సహచరులు వెనుదిరుగుతున్నా పట్టువదలని విక్రమార్కుడిలా ఓపెనర్ టామ్ లాధమ్ (79 నాటౌట్ (98 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. 65 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన తరుణంలో టెయిలెండర్లతో అనితరసాధ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. స్టార్ బౌలర్ టిమ్ సౌతీతో కలిసి లాధమ్ నెలకొల్పిన భాగస్వామ్యం కివీస్ ఇన్నింగ్స్ కు ఊపిరిలూదింది. కేవలం 45 బంతుల్లో మూడు సిక్సర్లు, 6 ఫోర్లతో సౌతీ సాధించిన 55 పరుగులు సెకెండ్ హయ్యెస్ట్ స్కోరు కావడం విశేషం. ఈ క్రమంలో ఓపెనర్ గా వచ్చిన లాధమ్ నాటౌట్ గా నిలిచిన న్యూజిలాండ్ ఆటగాడిగా నిలవగా, సౌతీ పదో డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చి అర్ధ సెంచరీ సాధించిన వన్డే ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ జట్టు 43.5 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో వన్డేల్లో అరంగేట్రం చేసిన హార్డిక్ పాండ్య, అమిత్ మిశ్రా చెరి మూడు వికెట్లతో రాణించగా, వారికి చెరి రెండు వికెట్లతో ఉమేష్ యాదవ్, కేదార్ జాదవ్ సహకారమందించారు. 191 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.

More Telugu News