: పాక్ సైన్యానికి ఒక్క యుద్ధ విమానం కూడా ఇవ్వడం లేదు: రష్యా

పాకిస్థాన్ మిలటరీ అవసరాలను తీర్చేలా ఏ విధమైన విమానాలను, చాపర్లను అందించడం లేదని రష్యా స్పష్టం చేసింది. ఇటీవల తాము కుదుర్చుకున్న డీల్ లో భాగంగా, రవాణా అవసరాలను మాత్రమే తీర్చేందుకు హెలికాప్టర్లను పాక్ కు అందించనున్నట్టు రోజ్ టెక్ కార్పొరేషన్ సీఈఓ సెర్గి చిమెజోవ్ వెల్లడించారు. సైన్యం అవసరాలకు వినియోగించుకునే ఏ విధమైన డీల్స్ పై రష్యా ఇంతవరకూ సంతకాలు పెట్టలేదని అన్నారు. బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా భారత ఆర్మీతో రక్షణ రంగానికి చెందిన డీల్స్ కుదుర్చుకునేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాక్ సైన్యం అవసరాలు తీర్చాలన్న ఆలోచన కూడా రష్యాకు లేదని అన్నారు. ఇటీవలి సంయుక్త విన్యాసాలను ప్రస్తావిస్తూ, అవి ఉగ్రవాదంపై పోరును తీవ్రం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే జరిగాయని అన్నారు. ప్రపంచానికే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ప్రమాదకరంగా మారారని, ఉగ్రవాదం భారత్ తో పాటు పాకిస్థాన్ కూ ఇబ్బందులు కలిగిస్తోందని వివరించారు.

More Telugu News