: గోవా బీచ్ రిసార్టులో చైనా మీడియా హంగామా... అడ్డుకోబోయిన పోలీసులతో గొడవ

గోవాలో బ్రిక్స్ దేశాల సమావేశాలు జరుగుతున్న వేళ, చైనా నుంచి వచ్చిన మీడియా ప్రతినిధుల బృందం, గత రాత్రి బీచ్ రిసార్టులో పోలీసులతో గొడవకు దిగింది. ఇక్కడి తాజ్ ఎక్సోటికా రిసార్టులో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, చైనా అధ్యక్షుడు క్సీ జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీలు తమ తమ అధికారులతో కలసి ఏకాంతంగా చర్చించుకుంటున్న వేళ, చైనా మీడియా అక్కడికి వచ్చింది. తమను లోనికి అనుమతించాలని గొడవ పెట్టుకుంది. అడ్డుకున్న ఓ మహిళా పోలీసును ఓ చైనా మీడియా సభ్యుడు చెయ్యి చేసుకున్నాడు. కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై ఎలాంటి పోలీసు కేసూ నమోదు కాలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా, రిసార్టు గ్రౌండ్ లో రెండు ఏసీ టెంట్లు ఏర్పాటు చేసి 250 మంది జర్నలిస్టులకు బ్రిక్స్ దేశాల సమావేశాలు కవర్ చేసేందుకు అనుమతించారు. ఇక చైనా మీడియా, పోలీసుల గొడవపై విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పందిస్తూ, ఏదో జరిగిపోయింది, దాని గురించి మాట్లాడాలని తాను అనుకోవడం లేదని తెలిపారు.

More Telugu News