: పాక్ జర్నలిస్టు అల్మైదాపై నిషేధాన్ని ఎత్తివేసిన పాక్.. విచారణ కొనసాగుతుందని వెల్లడి

పాకిస్థాన్‌లోని ప్రముఖ పత్రిక ‘డాన్’ జర్నలిస్టు సిరిల్ అల్మైదాపై విధించిన నిషేధాన్ని పాక్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్(ఈసీఎల్) జాబితా నుంచి అతడి పేరును తొలగించాలని పాక్ అంతర్గత శాఖా మంత్రి చౌదరి నిసార్ అలీఖాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రముఖ జర్నలిస్టులతో జరిగిన సమావేశం అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అతడిపై విచారణ మాత్రం కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కాగా సిరిల్ అల్మైదాపై నిషేధం ఎత్తివేతకు అంతకుముందు రోజే మంత్రి నిరాకరించడం గమనార్హం. అతడిపై విచారణ కొనసాగుతుండడంతో ఈసీఎల్ జాబితా నుంచి అతడి పేరును తొలగించే ప్రశ్నే లేదని పేర్కొన్నారు. డాన్ పత్రిక జర్నలిస్టు అయిన సిరిల్ ఈనెల 6న.. ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య విభేదాలు తలెత్తాయని, రెండింటి మధ్య సంబంధాలు ఏమంత బాగోలేవంటూ వార్త రాశారు. ఆ కథనంపై కన్నెర్ర చేసిన నవాజ్ ప్రభుత్వం ఆ వార్త వాస్తవ దూరంగా ఉందని, అసత్యాలు వండి వార్చారంటూ సిరిల్‌పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అతడు దేశం విడిచి వెళ్లకూడదంటూ నిషేధం విధిస్తూ ఈసీఎల్‌లో అతడి పేరు చేర్చింది. అయితే జర్నలిస్టుపై పాక్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం అతడిపై నిషేధాన్ని ఎత్తి వేసింది. అయితే అతడు రాసిన వార్తపై మాత్రం విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

More Telugu News