: తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. దీపావళి ముహూర్తం?

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రాష్ట్ర కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించాలని టీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుత మంత్రుల పదవీకాలం రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో దీపావళి పండుగను పురస్కరించుకుని కొందరిని పార్టీ కోసం పంపించి, కొత్తవారికి మంత్రి పదవులు ఇవ్వాలని అధిష్ఠానం ఆలోచనలో ఉంది. ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కేసీఆర్ ఓ పత్రికతో మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ముగ్గురో, నలుగురో పార్టీ కోసం వెళ్లాల్సి ఉంటుందని, ఆ సందర్భం వస్తే ఆలోచిస్తామని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు విస్తరణపై ప్రచారం జోరందుకుంది. జిల్లాల విభజనపై ప్రజలు సంతోషంగా ఉండడం, తొమ్మిది కార్పొరేషన్ చైర్మన్ పదవులను సీనియర్లతో భర్తీ చేయడంతో పార్టీలో మార్పులు చేర్పులకు ఇదే సరైన సమయమని పార్టీలోని ఓ వర్గం నేతలు భావిస్తుండగా, మరో వర్గం మాత్రం ఇప్పట్లో విస్తరణ ఉండకపోవచ్చని చెబుతోంది. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నారు. దసరా సందర్భంగా తొమ్మిది నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన సీఎం త్వరలోనే మరిన్ని పదవులను భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈసారి భర్తీలో మహిళలు, ముస్లింలు, ఇతర సామాజిక వర్గాలవారికి పెద్దపీట వేయాలని ఆయన భావిస్తున్నారు. కాగా ఇప్పటికే వేగం పుంజుకున్న మార్కెట్ కమిటీల నియామక ప్రక్రియను త్వరగా ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత దేవాలయ పాలక వర్గాల నియామకం చేపట్టనున్నట్టు సమాచారం.

More Telugu News