: భారత్ లోకి దూసుకెళ్లేందుకు అనుమతించండి: పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జైషే మొహమ్మద్ చీఫ్

ఇండియాలోకి దూసుకెళ్లి, సైనిక స్థావరాలపై దాడులను జరిపేందుకు తమను అనుమతించాలని జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. భారత్ పై దాడులు జరిపేందుకు జీహాదీ సంస్థలకు అనుమతించాలని ఆయన అన్నట్టు తెలుస్తోంది. కాశ్మీర్ ను పూర్తిగా ఆక్రమించుకునేలా చారిత్రక అవకాశం ఇప్పుడు పాకిస్థాన్ చేతుల్లో ఉందని, నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైతే అవకాశం చేజారుతుందని జైషే వార పత్రిక 'అల్ కాలామ్'లో ఆయన పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. భారత్ జరిపిన సర్జికల్ దాడుల నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునే చాన్స్ ఇవ్వాలని, అందుకు కాశ్మీర్ ను కానుకగా తెచ్చిస్తామని ఆయన అన్నట్టు తెలుస్తోంది. కొంచెం ధైర్యం చూపితే కాశ్మీర్ సమస్య, నీటి వివాదాలు తొలగిపోతాయని, ముజాహిద్దీన్లకు దారివ్వాలని, ఆపై ఏం జరుగుతుందన్నది దేవుడి దయగా మసూద్ అజర్ వ్యాఖ్యానించినట్టు పత్రిక తెలిపింది. గతంలో ఓ సర్పంలా ఉన్న భారత సైన్యం, ఇప్పుడు వానపాములా మారిపోయిందని, దానికి తానే సాక్షినని మసూద్ అవాకులు చవాకులు పేలినట్టు తెలుస్తోంది.

More Telugu News