: లంచం కేసులో కాగ్నిజంట్... ఐటీ ఇండస్ట్రీపై ప్రభావం!

న్యూజర్సీ కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ, ప్రతి నలుగురు ఉద్యోగుల్లో ఒకరిని భారత్ లో నియమించుకుని, ఐటీ సేవలందిస్తున్న కాగ్నిజంట్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ మొత్తం భారత ఐటీ రంగపైనే పడింది. జనవరి నుంచి రెండుసార్లు కాగ్నిజంట్ గ్రోత్ అంచనాలను తగ్గించుకుంది. అమెరికన్ మార్కెట్లో నాస్ డాక్ సూచిక కింద లిస్టింగ్ అవుతున్న కాగ్నిజంట్, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 15 శాతం వరకూ ఆదాయాన్ని కోల్పోనుందని, ఇది 1997 తరువాత నమోదయ్యే అతి తక్కువ వృద్ధి రేటని నిపుణులు వ్యాఖ్యానించారు. ఒక్క కాగ్నిజంట్ మాత్రమే కాదు, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి పలు ఐటీ దిగ్గజాలూ, ఇప్పటికే పలు కంపెనీలు తమ ఆదాయ వృద్ధి అంచనాలను కుదించి ప్రకటించాయి. ఇండియాలో వివిధ ప్రాంతాల్లో కాగ్నిజంట్ కేంద్రాలను నెలకొల్పేందుకు అధికారులకు లంచాలను ఇచ్చారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ విభాగం విచారణ ప్రారంభించగా, ఆ ఒక్క రోజునే కాగ్నిజంట్ 13 శాతం నష్టపోగా, దాదాపు రూ. 28 వేల కోట్ల విలువైన ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కాగ్నిజంట్ ప్రధాన పోటీ సంస్థలైన ఇన్ఫోసిస్, టీసీఎస్ లలో సైతం వివాదాలు తలెత్తాయి. వాణిజ్య రహస్యాలు బయటకు చెప్పడం, ఐపీ వయోలేషన్స్ కు సంస్థలు పాల్పడటం వంటి కేసులు ఈ కంపెనీలను ఇరుకున పెట్టాయి. ముఖ్యంగా భారత ఐటీ కంపెనీలకు ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్) విభాగానికి సంబంధించిన ఐటీ సేవల్లో వచ్చిన ఆరోపణలు దిగ్గజ ఐటీ కంపెనీలను ఇబ్బందులు పెడుతున్నాయి. దీంతో గడచిన త్రైమాసికంతో పోలిస్తే 1.5 శాతం వరకూ ఈ సంస్థల ఆదాయం తగ్గవచ్చని అంచనా. ఇక ఈ సంవత్సరం 10 నుంచి 12 శాతం వరకూ ఐటీ పరిశ్రమ వృద్ధి రేటు తగ్గనుందని ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ అంచనా వేసింది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, బ్రెగ్జిట్, పలు దేశాల్లో అమలవుతున్న రక్షణాత్మక ధోరణి, రూపాయి ఒడిదుడుకులు, హెచ్-1బీ అవకతవకలు తదితరాలు ఐటీ రంగంలోని కంపెనీలను దెబ్బకొడుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News