: నా వీడియోలు బయటపెడితే...క్లింటన్ కుటుంబ రహస్యాలు బయటపెడతా: ట్రంప్ వార్నింగ్

అమెరికా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి మరోసారి బెదిరింపులకు దిగారు. పెన్సిల్వేనియా లోని ఆంబ్రిడ్జ్ లో నిర్వహించిన ప్రచార సభలో డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, 11 ఏళ్ల క్రితం ప్రైవేట్ సంభాషణలో చోటుచేసుకున్న సంభాషణను రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వారి రాద్ధాంతానికి మీడియా వంతపాడుతోందని ఆయన ఆరోపించారు. రెండు రోజులపాటు ఆ మాటలనే హెడ్ లైన్స్ గా వార్తాపత్రికలు వేశాయని ఆయన విమర్శించారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోకపోతే వారికే నష్టమని ఆయన హెచ్చరించారు. ఆనాటి సంభాషణలపై రెండు సార్లు క్షమాపణలు చెప్పానని గుర్తు చేసిన ఆయన, తన మాటలకు సంబంధించిన వీడియోలు రిలీజ్ చేస్తామంటున్నారని, ఆ వీడియోలు రిలీజ్ చేయడం మానుకోకపోతే, హిల్లరీ కుటుంబానికి చెందిన రహస్యాలు బయటపెడతానని ఆయన హెచ్చరించారు. ఆమెకు మీడియా సపోర్ట్ ఇవ్వడం మానేస్తే ఆమె అసలు స్వరూపం బయటపడుతుందని ఆయన తెలిపారు. మీడియా సపోర్ట్ లేకపోతే కనీసం కుక్కల్ని పట్టే ఉద్యోగం కూడా ఆమెకు దొరకదని ఆయన తెలిపారు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను ఆయన ఓ సెక్స్ ప్రిడేటర్ గా అభివర్ణించారు. అమెరికా అధ్యక్ష చరిత్రలోనే ఆయన వేధించినంతగా మహిళలను ఎవరూ వేధించలేదని ఆయన తెలిపారు. క్లింటన్ బారినపడి అన్యాయమైపోయిన మహిళలను హిల్లరీ ఓదార్చకపోగా, భయబ్రాంతులకు గురిచేసేదని ఆయన విమర్శించారు.

More Telugu News