: నిన్ను వదలను.. ఏమనుకుంటున్నావో.. నీ సంగతి తేలుస్తా.. మైనింగ్ అధికారికి వైసీపీ నేత బెదిరింపులు

నెల్లూరు జిల్లాలో మైనింగ్ మాఫియా ఏ రకంగా రెచ్చిపోతుందో చెప్పేందుకు ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. మైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జడ్పీ సమావేశంలో అరిచి గీపెట్టిన నేతే ఇప్పుడు ఆ మాఫియాకు అండగా నిలుస్తున్నారు. పైపెచ్చు అడ్డుకుంటున్న అధికారులపై చిందులు తొక్కుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అయితే ఏకంగా అధికారి అంతుచూస్తానంటూ బెదిరించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న గ్రావెల్ అక్రమ రవాణాపై దాడులు నిర్వహించాలంటూ కలెక్టర్ ముత్యాలరాజు మైనింగ్ అధికారులను ఆదేశించారు. దీంతో గత నెల 24న వెంకటాచలం మండలం కనుపూరు, కనుమూరుల్లో గ్రావెల్ రవాణా వాహనాలపై అధికారులు దాడులు చేసి ఎన్ఎంజీ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలు ముత్తుకూరు వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు శివప్రసాద్‌రెడ్డివి. వాహనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు గ్రావెల్ అక్రమ తరలింపు లెక్కకట్టి మొత్తంగా రూ.58 లక్షల జరిమానా విధించారు. విషయం తెలుసుకున్న వైసీపీకి చెందిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజాప్రతినిధి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. రెండు రోజుల క్రితం మైనింగ్ అధికారిని కలిసి విరుచుకుపడ్డారు. ‘‘నా గురించి ఏమనుకుంటున్నావో.. నిన్ను వదలను. నీ సంగతి తేలుస్తా’’ అంటూ తీవ్రస్థాయిలో బెదిరించారు. అయితే ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు మైనింగ్ అధికారులు మౌనం వహిస్తున్నారు.

More Telugu News