: మాథ్యూతో అల్లాడిన అమెరికా.. హైతీలో మూడు రోజుల సంతాప దినాలు

మాథ్యూ తుపాను ప్రభావంతో అమెరికాలోని ఉత్తర కరోలినాలో శని, ఆదివారాల్లో కురిసిన కుంభవృష్టితో ప్రజలు అల్లాడిపోయారు. ముంచెత్తిన వరద బీభత్సం సృష్టించింది. ఇళ్లు, కార్లలో చిక్కుకున్న వారు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేశారు. వరదల్లో చిక్కుకుపోయిన వందలాది మందిని సహాయక సిబ్బంది రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ హరికేన్ ధాటికి ఇప్పటి వరకు అమెరికాలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సగం మంది ఉత్తర కరోలినాకు చెందిన వారే కావడం గమనార్హం. తుపాను ధాటికి ఇక్కడి నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు వర్జీనియాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇక మాథ్యూ ధాటికి చిగురుటాకులా వణికిపోయిన హైతీలో భారీ ప్రాణనష్టం సంభవించింది. దాదాపు ఐదు లక్షల మంది చిన్నారులు దుర్భర పరిస్థితుల్లో చిక్కుకున్నారు. వారి తక్షణ అవసరాలకు తక్కువలో తక్కువగా రూ.34 వేల కోట్లు అవసరమవుతాయని యూనిసెఫ్ పేర్కొంది. హైతీలో భారీ ప్రాణ నష్టం జరగడంతో ఆదివారం నుంచి దేశంలో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది.

More Telugu News