: జయలలిత అనారోగ్యాన్ని అవకాశంగా మలచుకునే ప్రయత్నంలో శశికళ.. ఉప ఎన్నికల్లో పోటీకి రెడీ!

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోటలో పాగావేసేందుకు ఆమె నెచ్చెలి శశికళ ప్రయత్నిస్తున్నారా? జయ అనారోగ్యాన్ని అవకాశంగా తీసుకుని పావులు కదిపేందుకు ఆమె సిద్ధమవుతున్నారా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రానున్న ఉప ఎన్నికల్లో తాను స్వయంగా బరిలోకి దిగడం కానీ, లేదంటే తన వారికి అవకాశం కల్పించడం కానీ చేసి, జయలలిత కోటలో శిశికళ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. జయలలిత వ్యక్తిగత జీవితంలో కీలకపాత్ర పోషించిన శశికళకు రాజకీయంగా మంచి పలుకుబడితోపాటు సామాజికంగా బలమైన దేవర్ కులానికి చెందిన ఆమెకు వారి మద్దతు పుష్కలంగా ఉంది. మంత్రి పన్నీర్ సెల్వం కూడా ఇదే కులానికి చెందిన వారు. జయలలిత, శశికళకు ఆయన అత్యంత విశ్వాసపాత్రుడు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించిన శశికళ ఆశ నెరవేరలేదు. దీంతో ప్రస్తుత పరిస్థితులను అవకాశంగా మలచుకుని రాజకీయాల్లో అడుగుపెట్టాలని ఆమె భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. నగదు పంపిణీ జరిగిందనే ఆరోపణలతో ఎన్నికలు వాయిదా పడిన కరూరు జిల్లాలోని అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాలతోపాటు అన్నాడీఎంకే ఎమ్మెల్యే శీనివేల్ మృతి చెందడంతో ఖాళీ అయిన మధురై జిల్లాలోని తిరుపరగుడ్రం నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నెలాఖరులోనే వీటికి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. జయలలిత తర్వాత పార్టీలో అభ్యర్థులపై నిర్ణయం తీసుకునే అధికారం ఒక్క శశికళకే ఉంది. దీంతో ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తాను బరిలోకి దిగడమో, లేదంటే తనవారిని దింపడమో చేసి పట్టుసాధించేందుకు శశికళ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

More Telugu News