: శవాల దిబ్బగా మారిన హైతీ... 900 మందికి పైగా మరణం, సాయం కోసం 10 లక్షల మంది ఎదురుచూపులు

మాథ్యూ తుపాను ధాటికి హైతీ శవాల దిబ్బగా మారింది. ఒక్క జెరెమి జిల్లాలోనే 470 మందికి పైగా మరణించగా, రాయిటర్స్ కథనం ప్రకారం, మొత్తం తుపాను మృతుల సంఖ్య 900కు పైగానే ఉందని సమాచారం. దాదాపు 30 వేలకు పైగా ఇళ్లు నేలమట్టం కాగా, మాథ్యూ బీభత్సం సృష్టించి మూడు రోజులైనా నష్టం అంచనాలు కూడా మొదలు పెట్టే పరిస్థితి లేదంటే అక్కడెలాంటి విలయం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులైన ప్రజలు తిండి, నీళ్ల కోసం పడిగాపులు పడుతున్నారు. రోడ్లపై భారీ వృక్షాలు నేలకూలడంతో, సహాయక చర్యలు నిదానంగా సాగుతున్నాయి. దేశ దక్షిణ ప్రాంతంలోని ఓ పల్లెలో 82 మంది మరణించారని తెలుస్తోంది. చాలా గ్రామాల్లో 90 శాతం ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఇక హైతీలో నేడు జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఓటింగ్ కేంద్రాలు, పోలీసు స్టేషన్లు, స్కూళ్లు కుప్పకూలడంతో ఓటింగ్ నిర్వహించే పరిస్థితులు లేవని అధికారులు వెల్లడించారు. హైతీ ప్రజలను ఆదుకునేందుకు అమెరికన్లు సహృదయంతో ముందుకు రావాలని బరాక్ ఒబామా కోరారు. ఇప్పటికీ ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినా ప్రాంతాల్లో 20 లక్షల మంది చీకట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News