: ఆ పేరు పెట్టుకుని ఈ నాటకంలో ఎలా నటిస్తావ్?: నవాజుద్దీన్ పై ‘శివసేన’ ఆగ్రహం

‘రాం లీలా’ నాటకంలో నటించ వద్దంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీని శివసేన పార్టీ కార్యకర్తలు హెచ్చరించారు. దీంతో, ఆ నాటకంలో ఆయన ఎటువంటి పాత్రం వేయలేదు. ఈ సంఘటన నవాజుద్దీన్ సిద్దిఖీ స్వగ్రామమైన యూపీ ముజఫర్ నగర్ జిల్లాలో ఉందీఊరులోని బదానా గ్రామంలో జరిగింది. దసరా నవరాత్రుళ్లు సందర్భంగా ‘రాంలీలా’ నాటకాన్ని ప్రదర్శిస్తుండటం ఆ గ్రామంలో దాదాపు వంద సంవత్సరాల నుంచి ఉన్న ఆనవాయతి. సిద్దిఖీ చిన్నప్పటి నుంచి ఈ నాటకాన్ని చూస్తునే ఉండేవాడు. ఎప్పటికైనా సరే, ఆ నాటకంలో ఏదో ఒక పాత్ర పోషించాలని అనుకునేవాడు. ఈ క్రమంలోనే తాను కూడా ఒక పాత్ర పోషిస్తానని నాటకం నిర్వాహకులను సిద్దిఖీ అడుగగా అందుకు అంగీకరించారు. మారీచుడి పాత్రను పోషించేందుకు సిద్దికీ రెడీ అయ్యాడు. ఈ విషయం గ్రామ ప్రజలకు తెలియడంతో.. సినిమా నటుడిని రంగస్థలంపై చూడబోతున్నామంటూ సంతోషించారు. కట్ చేస్తే, నిన్న నాటకం ప్రారంభించడానికి రెండు గంటల ముందు ఈ నాటకంలో సిద్దిఖీ నటించడం లేదంటూ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో, అభిమానులు నిరుత్సాహపడ్డారు. కాగా, తనకు ఎంతో ఇష్టమైన ఈ నాటకంలో ఒక పాత్ర పోషించాలనుకున్న సిద్దిఖీ ఉన్నపళంగా ఎందుకు వైదొలిగాడనే విషయమై ఆరా తీస్తే, అసలు విషయం బయటపడింది. ‘నవాజుద్దీన్ సిద్దిఖీ అనే పేరు పెట్టుకుని ఈ నాటకంలో ఎలా నటిస్తావ్?’ అని శివసేన కార్యకర్తలు ఆయన్ని హెచ్చరించడమే కారణమని ప్రత్యక్షసాక్షుల సమాచారం. ఈ సందర్భంగా సిద్దిఖీ మీడియాతో మాట్లాడుతూ, స్వగ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం తనకు ఇష్టం లేదని, అందుకే, నటించకూడదని నిర్ణయించుకున్నానని చెప్పాడు. కాగా, ఈ సంఘటనపై యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. నటీనటులకు మతాలు అంటగట్టకూడదని, వారికి ప్రతిభ మాత్రమే ఉంటుందన్న విషయాన్ని శివసేన కార్యకర్తలు గుర్తించాలని అఖిలేష్ హితవు పలికారు.

More Telugu News