: మాజీ ప్రధాని చంద్రశేఖర్ పుట్టిన తేదీకి సంబంధించిన సమాచారం మా వద్ద లేదు: ప్రధాని కార్యాలయం

మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ పుట్టిన తేదీకి సంబంధించిన కచ్చితమైన సమాచారం తమ వద్ద లేదని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార కమిషన్ కు సమాచారం అందించింది. ఫరూఖాబాద్ కు చెందిన ఆర్టీఐ కార్యకర్త శివనారాయణ్ శ్రీవాస్తవ... చంద్రశేఖర్ పుట్టిన తేదీ ఎప్పుడో చెప్పాలంటూ సమాచార కమిషన్ ను ఆశ్రయించారు. పీఎంఓ వెబ్ సైట్ లో చంద్రశేఖర్ పుట్టిన తేదీ జులై 1గా ఉందని... ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆయన జన్మదినం అంటూ ఏప్రిల్ 17న సెలవు ఇస్తుందని శ్రీవాస్తవ తెలిపారు. ఈ రెండు తేదీల్లో ఏ తేదీ కరెక్టో తెలపాలని... ఆయన జన్మదినాన్ని ఎప్పుడు జరుపుకోవాలో చెప్పాలని సమాచార కమిషన్ ను కోరారు. దీనికి సమాధానంగా, చంద్రశేఖర్ జన్మదినానికి సంబంధించిన సరైన ఆధారాలు తమ వద్ద లేవని ప్రధాని కార్యాలయం సమాచార కమిషన్ కు తెలిపింది. దివంగత చంద్రశేఖర్ ఉత్తరప్రదేశ్ లోని బల్లాయి జిల్లా ఇబ్రహీంపట్టి గ్రామంలో జన్మించారు. 1977 నుంచి 1988 వరకు జనతా పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. 1990 నవంబర్ 10వ తేదీ నుంచి 1991 జూన్ 1 వరకు భారత ప్రధానిగా పని చేశారు. మన దేశానికి 8వ ప్రధానిగా ఆయన సేవలు అందించారు.

More Telugu News