: ట్రక్కుల్లో ఉగ్రవాదుల శవాలను తీసుకెళ్లిన ఐఎస్ఐ: ప్రత్యక్షసాక్షి

పలు రాజకీయ పార్టీలు సర్జికల్ దాడులపై సాక్ష్యాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న వేళ, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో నివాసముంటున్న ఓ వ్యక్తి బుధవారం నాడు వెల్లడించిన అంశాలు దాడులు నిజమనే చెబుతున్నాయి. వాస్తవాధీన రేఖకు ఆవల మరణించిన ఉగ్రవాదుల మృతదేశాలను ట్రక్కుల్లో వేసుకుని తీసుకెళ్లిన ఐఎస్ఐ, వారిని రహస్యంగా ఖననం చేసిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఈ ఉగ్రవాదుల నివాసాలను భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసిందని, పాక్ ప్రేరేపిత జీహాదీలు, భారత సైన్యం మధ్య చాలా సేపు కాల్పులు జరిగాయని ఇద్దరు సాక్షులు చెప్పినట్టు 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అల్ హావీ బ్రిడ్జ్ సమీపంలో ఉగ్రవాదులు తలదాచుకున్న భవనాన్ని సైన్యం పూర్తిగా ధ్వంసం చేసిందని వారు తెలిపారని పేర్కొంది. ఈ వారధికి అవతలి వైపున ఆశ్రయం పొందే ఉగ్రవాదులకు లష్కరే తోయిబా వంటి సంస్థలు ఆయుధాలను, మందుగుండును సరఫరా చేసి వారిని హద్దులు దాటిస్తుంటాయి. సెప్టెంబర్ 29న ఉదయం పూట ఐదు నుంచి ఆరు శవాలను ఓ ట్రక్కులో వేసుకుని తీసుకెళ్లారని, ఆ ట్రక్కు తీత్వాల్ సమీపంలో నీలం నదిని దాటి చల్హానాలోని లష్కరే క్యాంపుకు వెళ్లి వుండవచ్చని సాక్షులు వెల్లడించినట్టు పత్రిక తెలిపింది. దాడి జరిగిన ప్రాంతంలోనే కొన్ని శవాలను పాతిపెట్టారని పేర్కొంది.

More Telugu News