: పాకిస్తానీ బాలికలు నా కూతుళ్లతో సమానం: సుష్మా స్వరాజ్ ట్వీట్ పై ప్రశంసలు

కూతుళ్లు ఎవరికైనా కూతుళ్లేనని, పాకిస్థానీ బాలికలు తన కూతుళ్లతో సమానమంటూ కేంద్ర విదేశాంగ శాఖమంత్రి సుష్మా స్వరాజ్ చేసిన ట్వీట్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అసలు, సుష్మా ఈ ట్వీట్ ఎందుకు చేశారంటే... పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)పై భారత సైన్యం నిర్దేశిత దాడులు చేయక ముందు, అంటే, గతవారంలో పాకిస్థాన్ కు చెందిన 19 మంది బాలికలు చండీఘడ్ లో జరుగుతున్న యూత్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు వచ్చారు. అయితే, నిర్దేశిత దాడుల కారణంగా వారు తిరిగి పాక్ కు వెళ్లడంలో కొంత ఆటంకం ఏర్పడింది. దీంతో, ఆ బాలికల తల్లిదండ్రులు, పాకిస్థాన్ కు చెందిన ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆందోళనకు గురయ్యారు. వారిని తమ దేశానికి త్వరగా పంపించాలని మన అధికారులను కోరారు. ఈ నేపథ్యంలోనే బాలికల తల్లిదండ్రులకు, ఆర్గనైజర్లకు ధైర్యం చెబుతూ సుష్మా స్వరాజ్ ఈ ట్వీట్ చేశారు. ఆ బాలికలను సురక్షితంగా పాకిస్థాన్ కు పంపించే బాధ్యత తనదంటూ ఈ ట్వీట్ చేశారు. దీనిపై భారత్ లోనే కాకుండా దాయాది దేశం పాకిస్థాన్ లోనూ సుష్మాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, నేడు పాకిస్థాన్ బాలికలు సురక్షితంగా తిరుగు పయనమయ్యారు. వారి కోసం అదనపు భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే, సుష్మా ట్వీట్ పై డెలిగేషన్ కన్వీనర్ ఆలియా హరీర్ సంతోషం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేశారు. భారత్ లో అతిథులను దేవుళ్ల లాగా చూసుకుంటారంటూ ప్రశంసించారు.

More Telugu News