: పీఓకేలో ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి కనీసం ఆర్నెల్ల సమయం కావాలి: భారత్ ఆర్మీ

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఉగ్రవాదులు అన్న వాళ్లు లేకుండా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత్ ఆర్మీ అంటోంది. అప్పుడప్పుడు నిర్వహించే నిర్దేశిత దాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) వల్ల ప్రయోజనం లేదని ఆర్మీ సీనియర్ అధికారులు అంటున్నారు. పీఓకే లో ఉగ్రవాదులు లేకుండా చేయడానికి తమకు కనీసం 6 నెలల సమయం ఇస్తే.. వారిని మట్టుబెట్టేస్తామని అన్నారు. ఇందుకోసం, ఒక పక్కా ప్రణాళిక కూడా రూపొందించాలని సీనియర్ అధికారులు కోరుతున్నారు. నిర్దేశిత దాడుల అనంతరం ఉగ్రవాదులు కొంత వెనుకడుగు వేశారని, ఇదేవిధంగా కొనసాగాలంటే కనీసం ఆరు నెలల పాటు ఈ దాడులను కొనసాగించాలని ఒక ఆర్మీ అధికారి అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులకు సాయం చేసే గ్రూపులను నైతికంగా దెబ్బతీయడానికి ఇదే సరైన సమయమని ఆయన అన్నారు. నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కంటే మనకు ఎక్కువ పట్టు ఉందని, ఆర్మీ అంతా సిద్ధంగా ఉందని అన్నారు. అయితే, పాక్ పై ఈ తరహా దాడుల వల్ల కాశ్మీర్ లో ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని కూడా ఆర్మీ బలగాల సీనియర్ వ్యూహకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిర్దేశిత దాడుల అనంతరం ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పాక్ పై నిర్దేశిత దాడులు చేశామని అధికారికంగా ప్రకటించినప్పుడల్లా కాశ్మీర్ లో భద్రతను మరింత పెంచాలనీ, రాజకీయ వ్యూహాలను కూడా మార్చాల్సిన అవసరం ఉందని ఆర్మీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాగా, ప్రస్తుతం పీఓకేలో 40 నుంచి 50 వరకు ఉగ్రవాద క్యాంపులు ఉన్నట్లు మిలిటరీ, ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్యాంపుల్లో సుమారు 200 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది.

More Telugu News