: లలిత నా చెల్లెలు కాదు...నా బంగారం: బెల్లి కృష్ణ

1999 మే 26న తన చెల్లెలు బెల్లి లలిత హత్యకు గురైతే, ఆమె హత్యకు గురైందని నిర్ధారణ జరిగింది మాత్రం జూన్ 4న అని బెల్లి కృష్ణ తెలిపారు. ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, బెల్లి లలిత తన ఐదుగురు చెల్లెళ్లలో ఒకతె మాత్రమే కాదని, తన అడుగులో అడుగు వేసి నడిచిన బంగారుతల్లి అని అన్నారు. తాను ఉద్యమంలోకి వెళ్తే తనతోపాటు ఆమె కూడా వచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను పోరాడతానంటే 'నేనున్నా నన్నా' అంటూ తనతోపాటు వచ్చిన బంగారు చెల్లెలని ఆయన తెలిపారు. అలాంటి చెల్లెల్ని ముక్కలుగా నరికి చంపారని ఆయన గుర్తు చేసుకున్నారు. అది కూడా సుధాకర్ నమ్మకద్రోహం కారణంగా జరిగిందని... 'అక్కా! తెలంగాణ నాయకులు వచ్చారు మాట్లాడుదాం రా' అని అంటేనే తన చెల్లెలు అతనితోపాటు వెళ్లిందని ఆయన తెలిపారు. తన వారు అని నమ్మిన వారే ఆమెకు నమ్మకద్రోహం చేశారని ఆయన అన్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వాల అండ చూసుకుని రెచ్చిపోతున్న నయీంకు భయపడి దూరంగా ఉన్నానని, ఇఫ్పుడు తాము కలలు కన్న తెలంగాణ ప్రభుత్వం రావడంతో అలాంటి భయాలన్నీ వీడి మళ్లీ వచ్చానని ఆయన తెలిపారు.

More Telugu News