: సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ లాంటి వాడు...బుర్ర పనిచేయదు: రాజ్ ఠాక్రే

ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ లాంటివాడని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే కామెంట్ చేశారు. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై ముంబైలో ఆయన మాట్లాడుతూ, సల్మాన్ ఖాన్ కు ట్యూబ్ లైట్ లా బుర్రపనిచేయదని అన్నారు. లేకపోతే దేశం మొత్తం పాకిస్థాన్ తీరును తప్పు పడుతుంటే, నటీనటులను వేరుగా చూడాలని సల్మాన్ అంటున్నాడని మండిపడ్డారు. భారత్ లోని ప్రజలతో పాకిస్థాన్ లోని ప్రజలకు విరోధం లేదని ఆయన స్పష్టం చేశారు. పాక్ నటులు కనిపిస్తే దాడులు చేస్తామని చెప్పిన నేతలకు కూడా వారితో వ్యక్తిగత విరోధం లేదని ఆయన తెలిపారు. కానీ ఒక దేశం విధానం టెర్రరిజం అయినప్పుడు ఆ దేశీయులతో మెలగే విధానం అంటూ ఒకటి ఉంటుందని, దానిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆయన సూచించారు. 'కళాకారులకు బౌండరీలు ఉండవని సల్మాన్ అంటున్నాడు. ఏం కళాకారులేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? వారికి వీసాలు, పాస్ పోర్టులతో సంబంధం లేదా?' అని ఆయన నిలదీశారు. భారతీయుల కష్టార్జితాన్ని తింటున్న ప్రతి ఒక్కరికీ ఇది ఫ్యాషన్ అయిపోయిందని ఆయన మండిపడ్డారు. సరిహద్దుల్లోని మన సైనికులకు, పాకిస్థాన్ సైనికులకు మధ్య కూడా వ్యక్తిగత విరోధం లేదని, అలా అని వారు పహారా కాయడం మానేస్తే సల్మాన్ ఖాన్ క్షేమంగా ఉంటాడా? అని ఆయన నిలదీశారు. సల్మాన్ మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. లేని పక్షంలో సల్మాన్ అభిమానులే బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు.

More Telugu News