: తెరవెనుక 'హీరో' అజిత్ దోవల్... ఎవరీయన? ఆయన సామర్థ్యమేంటి?

భారత్, పాక్ ల మధ్య యుద్ధం జరుగుతుందా? జరిగితే నష్టం ఏ స్థాయిలో వుంటుంది?... ప్రస్తుతం ప్రపంచం మొత్తం చర్చిస్తున్న ఏకైక అంశం ఇదే! యూరీ సెక్టార్ లో పాక్ తీవ్రవాదులు.. ఆదమరచి నిద్రపోతున్న భారత జవాన్లను అత్యంత పాశవికంగా హత్య చేసినప్పుడు అంతర్జాతీయంగా అన్ని దేశాలు ప్రొసీడింగ్స్ లో భాగంగా ఖండించాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతామని సంఘీభావం తెలిపాయి. భారత ప్రభుత్వం కూడా అమర జవాన్ల త్యాగాలు వృథాగా పోనివ్వబోమని ప్రకటించింది. వీటన్నింటినీ చూసి పాకిస్థాన్ వికటాట్టహాసం చేసింది. భారత్ చేయగలిగేది ఏమీ లేదని భావించింది. 'మేము చెప్పం, చేసి చూపిస్తా'మన్న భారత ప్రధాని వ్యాఖ్యలను కూడా ఎప్పుడూ చెప్పేవేలే అని పాక్ భావించింది. అయితే భారత్ ఇంత తీవ్రంగా స్పందిస్తుందని అస్సలు ఎవరూ ఊహించలేదు. ఈ విషయంలో తెరవెనక చేయాల్సిందంతా ఇద్దరు వ్యక్తులు మరో ముగ్గురు వ్యక్తుల సహకారంతో చేసుకుపోయారు. వారే ఒకరు రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ప్రధాని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్! వీరిద్దరూ తెరమీద కనిపించలేదు. కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు. వీరిద్దరూ తెర వెనక ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్ లతో చర్చలు జరిపారు. సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కీలక సమయాల్లో ఎవరిని రంగంలోకి దించుదామని చర్చించుకున్నారు. మూడో కంటికి తెలియకుండా నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరించారు. ప్లాన్ చేశారు. ఆర్డర్స్ తీసుకున్నారు. ఆర్డర్స్ ఇచ్చేశారు. దిశానిర్దేశం చేయడం ప్రారంభించారు. ప్రతిక్షణం సమరాంగంలో ఉన్న కమెండోల నుంచి సమాచారం అందుకుంటూ విజయం సాధించేంతవరకు విశ్రమించకుండా శ్రమించారు. తెల్లవారుజామున ప్రధానికి అజిత్ దోవల్ ఫోన్ చేసి 'పని అయిపోయింది' అని గుడ్ న్యూస్ చెప్పేశారు. వెంటనే ప్రధాని రంగంలోకి దిగారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మాజీ ప్రధానులకు ఫోన్ చేసి వారందరికీ విజయంపై సమాచారం అందించారు. వెంటనే రాజ్ నాథ్ సింగ్ ను రంగంలోకి దించి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్లు చేసి, ప్రతిపక్ష పార్టీల నేతలను సమావేశపరిచి విషయం వివరించారు. ఇంత తతంగం గుట్టుచప్పుడు కాకుండా, చాకచక్యంగా పూర్తి చేసిన బుర్ర ఎవరిదంటే.... జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ది. అసలింతకీ ఈ అజిత్ దోవల్ ఎవరు? ఇతని సామర్థ్యమేంటి? అని ఓసారి అవలోకిస్తే.... ఆయన పూర్తి పేరు అజిత్ కుమార్ దోవల్. ప్రస్తుత ఉత్తరాఖండ్ లోని పౌరీగర్వాల్ లో 1940 జనవరి 20న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1968 లో కేరళ కేడర్ ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. కేరళ కేడర్‌ కి చెందిన దోవల్ 2004-05 సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌ గా వ్యవహరించారు. 1980లలో మిజో నేషనల్ ఫ్రంట్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించింది. ఆ సమయంలో దోవల్ ఆ సంస్థలోకి చొరబడి, దాని అగ్రకమాండర్లు ఆరుగురిని మట్టుబెట్టారు. దాంతో ఎంఎన్ఎఫ్ నిర్వీర్యమైపోయి కనుమరుగైపోయింది. ఇక పాకిస్థాన్‌ లో గూఢచారిగా ఏడు సంవత్సరాలు పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఒక భిక్షగాడి వేషంలో కూడా తిరిగేవారని అంటారు. పాకిస్థాన్‌ లో భారత గూఢచారులు పట్టుబడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. చిత్రహింసలు పెట్టి మరీ చంపేస్తారు. అది తెలిసి కూడా ఏకంగా ఏడేళ్ల పాటు అక్కడే ఉండి వాళ్ల రహస్యాలను తెలుసుకున్న ఘనత దోవల్‌ ది. అప్పట్లోనే ఆయన కుక్కే పారే లాంటి కశ్మీరీ ఉగ్రవాదులను ఆయా ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా మార్చేశారు. ఇక భారత సైన్యం స్వర్ణ దేవాలయంలో 'ఆపరేషన్ బ్లూస్టార్' నిర్వహించిన సమయంలో దోవల్ ముందుగానే స్వర్ణదేవాలయంలోకి వెళ్లిపోయారు. అక్కడ ఆయన పాకిస్థానీ గూఢచారిగా నటించి, ఉగ్రవాదుల ప్లాన్లన్నీ తెలుసుకుని, వాటిని సైన్యానికి అందించారు. ఆ తరువాత 1996లో జరిగిన కాందహార్ విమాన హైజాక్ ఉదంతంలో హైజాకర్లతో చర్చలు జరిపిన వారిలో ఆయన ఒకరు. మన దేశంలో 1971 నుంచి 1999 వరకు చోటుచేసుకున్న 15 హైజాక్ ఘటనల్లో బందీల విడుదలలో ఆయన పాత్ర కీలకమైనది. ఐపీఎస్ అధికారిగా ఉంటూ శాంతి సమయంలో సైనికాధికారులకు అందించే విశిష్ట సేవా పురస్కార్ ను 1988లో సాధించిన ఘనత దోవల్ సొంతం. ఇలా పతకం పొందిన ఏకైక పోలీసు అధికారి ఆయనే. సిక్కిం భారత్ లో విలీనం కావడం వెనుక దోవల్ ముఖ్యపాత్ర పోషించారని అఫీషియల్ ఫైల్స్ చెబుతున్నాయి. తరువాత భారత హైకమిషనర్ గా ఆరేళ్లపాటు ఇస్లామాబాద్ లో ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. భారత నిఘా విభాగానికి డైరెక్టర్ గా ఉంటూ ఆయన 2005లో పదవీ విరమణ చేశారు. యూపీఏ ఆయనను పెద్దగా పట్టించుకోనప్పటికీ 2014 మే 26న మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత... 30వ తేదీన దోవల్ ను ఎన్‌ఎస్‌ఏ పదవిలో నియమించారు. అప్పటి నుంచి ప్రభుత్వం విదేశీ వ్యవహారాలకు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఆయన ఎన్నో వ్యవహారాలు చాకచక్యంగా చక్కబెట్టేశారు. ఇరాక్ ముష్కరులకు చిక్కిన 45 మంది భారతీయ నర్సులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు. అంతే కాదు, శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స తోక జాడిస్తున్నాడని తెలియగానే, ఎన్నికలలో ఆయనను ఓడించి, మైత్రీపాల సిరిసేనను గద్దెనెక్కించడంలో దోవల్ రచించిన వ్యూహం సూపర్ హిట్టయింది. రాజపక్స భారతదేశానికి తలనొప్పిగా మారి, చైనాకు అనుకూలంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. దాంతో తర్వాతి ఎన్నికల్లో ఆయన నెగ్గడానికి ఏమాత్రం వీల్లేదని భావించిన దోవల్, శ్రీలంకకు వెళ్లి ఏం మాయ చేశారో గానీ, మైత్రిపాల సిరిసేన తదుపరి అధ్యక్షుడయ్యారు. ఒకప్పుడు రాజపక్సకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండే సిరిసేనను ఆయనపై రెచ్చగొట్టి పోటీకి నిలబెట్టింది కూడా దోవలే అంటే షాక్ కు గురవ్వాల్సిందే. సిరిసేనపై మాజీ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేను పోటీ చేయొద్దని కోరి, ఒప్పించడంలో కూడా దోవల్ విజయం సాధించడం విశేషం. దాంతో రాజపక్స ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటు చీలిపోకుండా చేసి, సిరిసేనను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. భారత్ తరఫున ఇన్ని రాచకార్యాలను మూడోకంటికి తెలియకుండా చక్కబెడుతున్న అజిత్ దోవల్ తెరవెనుక హీరో అనడంలో సందేహం లేదు!

More Telugu News