: హిల్లరీ క్లింటన్ కు సంబంధించిన 3,000 పేజీల ఈ మెయిల్స్‌ను వెబ్ లో పెట్టనున్న అధికారులు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ద‌గ్గ‌ర ప‌డుతోన్న నేప‌థ్యంలో డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్‌కి సంబంధించిన ఈ మెయిల్స్‌ను ప్ర‌జ‌ల‌కు త్వ‌ర‌లోనే అందుబాటులో ఉంచ‌నున్నారు. ఆ దేశ‌ అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 9న జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఆ తేదీ లోపే అధికారులు ఈ ప‌ని పూర్తి చేయాలని చూస్తున్నారు. హిల్లరీ క్లింటన్‌ కంప్యూటర్‌ నుంచి ఇప్ప‌టికే ఎఫ్‌బీఐ అధికారులు ఈ మెయిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 3,000 పేజీలను ప్రజలకు బ‌హిర్గ‌తం చేయ‌నున్నారు. త‌మ దేశ అధ్య‌క్ష ఎన్నికలకు ముందే హిల్లరీ క్లింట‌న్‌కు చెందిన 1050 పేజీల మెసేజ్‌ల‌ను గ‌వ‌ర్న‌మెంట్ స‌మ‌గ్రంగా ప‌రిశీలించాల‌ని కొన్ని రోజుల ముందు ఫెడరల్‌ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అయితే, మరో ఇద్దరు జడ్జిలు ఆ పేజీల సంఖ్య‌ను 3,000కు పెంచారు. త్వ‌ర‌లోనే వీటిని అంత‌ర్జాలంలో పెట్ట‌నున్నారు. ఆ ప‌నిలోనే ఎఫ్‌బీఐ అధికారులు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం స‌ద‌రు ఈ మెయిల్స్‌లో ఉన్న సందేశాలు హిల్లరీ సహాయకులు చేసిన ఈ మెయిల్స్‌ మాత్రమేనని భావిస్తున్నారు. వాటిని హిల్లరీ క్లింట‌న్‌ నేరుగా చేసి ఉండకపోవ‌చ్చ‌ని అనుకుంటున్నారు. గతంలో హిల్ల‌రీ క్లింట‌న్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌గా (విదేశాంగ మంత్రి) ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, ఆమె ఆ హోదాలో వ్యక్తిగతంగా ఈమెయిల్స్‌ వినియోగించారని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇటీవల జరిగిన బిగ్‌ డిబేట్లో ఆమె ప్రత్యర్థి ట్రంప్ కూడా ఈ అంశాన్ని లేవ‌నెత్తారు.

More Telugu News