: హడావుడిగా వెళ్లి ప్రపంచ బ్యాంకును ఆశ్రయించిన పాకిస్థాన్

భారత్, పాకిస్థాన్ ల మధ్య 56 సంవత్సరాల క్రితం కుదిరిన సింధూ జల ఒప్పందాన్ని మరోసారి సమీక్షించాలని భారత్ నిర్ణయం తీసుకోనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, అదే జరిగితే తమకు తీవ్ర ఇబ్బందులు తప్పవని భావిస్తున్న పాకిస్థాన్, విషయాన్ని వరల్డ్ బ్యాంక్ తో మొరపెట్టుకుంది. నీటి పంపకం విషయంలో నాడు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించగా, ఇప్పుడూ వారే కల్పించుకుని పరిస్థితి చెయ్యి దాటకుండా చూడాలని వేడుకుంది. పాక్ అటార్నీ జనరల్ అస్తర్ అసఫ్ అలీ నేతృత్వంలోని ఓ బృందం వాషింగ్టన్ డీసీలోని వరల్డ్ బ్యాంక్ అధికార కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారులను కలిసి చర్చించినట్టు జియో న్యూస్ వెల్లడించింది. ఆయనతో పాటు పాక్ నీటి పారుదల శాఖ కార్యదర్శి ముహమ్మద్ యూనిస్ డాగా, సింధూ జలాల కమిషన్ లో పాక్ అధికారి మిర్జా ఆసిఫ్ బెయిగ్, అమెరికాలో పాక్ అంబాసిడర్ అబ్బాస్ జిలానీ, పాక్ లో వరల్డ్ బ్యాంక్ ఈడీ నాసిర్ ఖోసా తదితరులు ఉన్నారు. తమకు అన్యాయం జరుగకుండా చూడాలని కోరుతూ, పాకిస్థాన్ దేశం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించిందని వెల్లడించిన జియో న్యూస్ మరిన్ని వివరాలు మాత్రం తెలియజేయలేదు.

More Telugu News