: నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఎన్నో సార్లు ఫిర్యాదు చేశాం: బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్

హైద‌రాబాద్‌లో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంత‌మైన‌ అల్వాల్‌లో ఈరోజు బీజేపీ తెలంగాణ నేత‌లు ప‌ర్య‌టించారు. వ‌ర‌ద‌ బాధితులను ప‌రామ‌ర్శించి, వారి క‌ష్టాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ... నాలాలు ఆక్ర‌మ‌ణ‌కు గుర‌యిన‌ప్ప‌టికీ చూస్తూ ఊరుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ‌లో డిజాస్టర్ మేనేజ్ మెంట్ కమిటీ లేదని ఆయ‌న అన్నారు. నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌పై తాము ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన‌ట్లు పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ అధికారులు స్పందించ‌లేద‌ని చెప్పారు. హైదరాబాద్‌ను కాపాడ‌డానికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. గ‌తంలో జ‌రిగిన త‌ప్పిదాలను రెండున్న‌రేళ్లు గ‌డిచినా తెలంగాణ ప్ర‌భుత్వం పూరించ‌లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అధికార యంత్రాంగంలో లోపభూయిష్టమైన విధానాలున్నాయని ఆయ‌న అన్నారు. తుర్క చెరువు పూర్తిగా క‌బ్జాకు గుర‌యిందని ఆరోపించారు. వ్య‌వ‌సాయ భూములు క‌బ్జాకు గుర‌వుతున్నా ఇరిగేష‌న్‌, రెవెన్యూ శాఖ‌లు, మున్సిప‌ల్ కార్పోరేష‌న్ క‌ళ్లు మూసుకున్నాయని ఆయ‌న అన్నారు. ఆక్ర‌మ‌ణ‌లు క‌డుతుంటే చూసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

More Telugu News