: భారత్ మాకు శత్రువే... పాకిస్థాన్ తోనే ఉంటాం: బలూచిస్థాన్ నేత బుగ్తీ సోదరుడు

యూరీ సెక్టార్ లో భారతసైనికులపై దాడి జరిగిన అంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ మద్దతిస్తున్న బలూచిస్థాన్ లోని జామ్హోరి వటన్ పార్టీ (జేడబ్ల్యూపీ) నేత షాజెయిన్ బుగ్తి మాట్లాడుతూ, పాక్‌ పై భారత్ యుద్ధానికి సిద్ధపడితే తనతో పాటు బుగ్తీ గిరిజనులంతా పాకిస్థాన్ కే అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. పాకిస్థాన్ కు మద్దతుగా, భారత్‌ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. కాగా, బలూచిస్థాన్‌ లో హత్యకు గురైన గిరిజన నేత నవాబ్ అక్బర్ బుగ్తీకి మనవడైన షాజెయిన్ బుగ్తి, స్విట్జర్లాండ్ లో ఉంటూ బలూచిస్తాన్‌ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగిస్తున్న బలూచ్ నేత బహ్రందాగ్ బుగ్తీకి వరుసకు సోదరుడు అవుతాడు. మరి బహ్రందాగ్ బుగ్తీ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా భారత్‌ లో ఆశ్రయం కోరుతున్నారు కదా? అని ప్రశ్నించినప్పుడు, జెనీవాలో ఉంటారో, ఇండియాలో ఉంటారో ఆయన ఇష్టమని సమాధానం చెప్పిన షాజెయిన్, అసలాయన బలూచ్ ప్రజల ప్రతినిధి కాదని అన్నారు. తాము మాత్రం నవాబ్ సాబ్ (అక్బర్ బుగ్తీ) ఆశయసాధనకు కట్టుబడి ఉంటామని తెలిపారు. నవాబ్ సాబ్ ఎప్పుడూ పాకిస్థాన్ వెంట నడిచేవారని, తాము కూడా ఆయనలాగే పాకిస్థాన్ కు మద్దతుగా ఉంటామని అన్నారు. బలూచిస్థాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు భారత్ కు లేదని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News