: గోదావరి జిల్లాలకు వరదముప్పు.. లోతట్టు కాజ్‌వేల వద్ద రాత్రివేళ్లలో రాకపోకలు నిషేధం

తెలంగాణ, మహారాష్ట్ర‌లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరదనీరు భారీగా చేరుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో గేట్లు తెరిచి, నది నీటిని కింది వదులుతుండడంతో ఉభయ గోదావరి జిల్లాలు వరద ముప్పుతో భయం గుప్పిట్లో చిక్కుకున్నాయి. వరద నీరు పోటెత్తుతుండంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రజలను అప్రమత్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని కాజ్‌వేల వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు కాపలా కాస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న కాజ్‌వేల వద్ద రాత్రిపూట ప్రయాణాలను నిషేధిస్తూ కలెక్టర్ భాస్కర్ ఆదేశాల జారీ చేశారు. నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు వరద సమాచారంపై తెలంగాణ, మహారాష్ట్ర కలెక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వరద ఉద్ధృతిపై అంచనా వేస్తున్నారు. గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతుండడంతో తూర్పు గోదావరి జిల్లాకు కూడా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ నుంచి కిందికి వస్తున్న నీరు మరో 48 గంటల్లో ధవళేశ్వరం బ్యారేజీకి చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. వరద ఉద్ధృతిని తట్టుకునేందుకు బ్యారేజీ నుంచి 2.33 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

More Telugu News