: సీఎం ఆదేశాలతో కదిలిన జీహెచ్ఎంసీ అధికారులు.. నగరంలో అక్రమ నిర్మాణాలపై నివేదిక సిద్ధం

సీఎం కేసీఆర్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు కదిలారు. హైదారాబాద్ నగరంలో నాలాలు ఆక్రమించి ఇళ్లు కట్టినవారిపై కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్ధమైంది. నగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఒక ప్లాన్ ప్రకారం నగరంలోని అక్రమకట్టడాలను తొలగిస్తామని జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ, తెలంగాణలో ఇప్పటికే కొన్ని అక్రమ కట్టడాలను తొలగించామని అన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి కోర్టుకు వెళ్లిన వాటిని ఏ విధంగా అధిగమించాలో ఆలోచిస్తున్నామన్నారు. కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, కిర్లోస్కర్ కమిటీ నివేదిక ప్రకారం నాలాలను ఆక్రమించి నిర్మించిన ఇళ్లపై అన్ని స్థాయుల్లో చర్చించడం జరిగిందన్నారు. భవిష్యత్ లో ఇటువంటి సమస్యలు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశమున్న కారణంగా, ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రతి సర్కిల్ లో ఫ్లైయింగ్ స్క్వాడ్లు, డిమాలిషన్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని, ఇతర శాఖల సహాయం కూడా తీసుకుని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని చెప్పారు. ఆయా ఇళ్లలో ఉన్నవారిని ఇప్పటికిప్పుడు ఖాళీ చేయించడం కష్టం కనుక పునరావసం కల్పించిన తర్వాతే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని జనార్దన్ రెడ్డి చెప్పారు.

More Telugu News