: పాక్ కు బుద్ధి వచ్చేలా మోదీ ఏమీ చేయట్లేదు... ప్రధాని వైఖరిపట్ల భారతీయుల అసంతృప్తి: అమెరికన్ సంస్థ సర్వే

పొరుగునే ఉండి ఇండియాలో విధ్వంసానికి దిగుతున్న పాకిస్థాన్ పై ప్రధాని నరేంద్ర మోదీ అవలంబిస్తున్న విధానం పట్ల అత్యధిక భారతీయులు అసంతృప్తితో ఉన్నారని అమెరికన్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. పాకిస్థాన్ కు బుద్ధి వచ్చేలా మోదీ ఏమీ చేయట్లేదని, అయినా గాంధీలతో పోలిస్తే, ప్రధానిగా మోదీ సమర్థుడని ప్రజలు అభిప్రాయపడుతున్నారని సర్వే నిర్వహించిన 'ప్యూ' పేర్కొంది. తమ సర్వేలో భాగంగా మొత్తం 2,464 మందిని ప్రశ్నించామని, ఇండియాలో నేరాల సంఖ్య పెరగడం అతిపెద్ద సమస్యని 82 శాతం మంది చెప్పారని, ఉద్యోగావకాశాలు లభించడం లేదని 81 శాతం, అధికారుల్లో అవినీతి పేరుకుందని 80 శాతం,, ఉగ్రవాదం పెను సమస్యేనని 78 శాతం మంది సర్వేలో పాల్గొన్న వారు చెప్పారని పేర్కొంది. అమెరికాతో మోదీ స్నేహబంధం పట్ల 54 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేయగా, పాకిస్థాన్ తో మోదీ వైఖరి అసంతృప్తిగా ఉందని 50 శాతం మంది, బాగుందని 22 శాతం మంది, ఇప్పుడే చెప్పలేమని 28 శాతం మంది చెప్పారు. ఇక దేశాన్ని నడిపించే నేతగా తొలి ఆప్షన్ మోదీయేనని 81 శాతం మంది, సెకండ్ ఆప్షన్ గా సోనియా (65 శాతం), ఆపై రాహుల్ (63 శాతం మంది)ను సర్వేలో పాల్గొన్న వారు ఎంచుకున్నారని 'ప్యూ' వెల్లడించింది.

More Telugu News