: అధికారులకు నిద్రపట్టనివ్వని మంత్రి...హైదరాబాదును చుట్టేస్తున్న కేటీఆర్

హైదరాబాదుకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా నగర వాసులకు మాట ఇచ్చిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. గత రెండు రోజులుగా ఆయన సమీక్షలు, సూచనలు, పర్యటనలతో గడుపుతున్నారు. పగలూ రాత్రి అన్న తేడా లేకుండా కేటీఆర్ పలు ప్రాంతాలను చుట్టేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధుల పాత్ర ఉండేలా ఆయన చూసుకుంటున్నారు. ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆయన పాత్ర గణనీయమైనదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిన్న రోజంతా వివిధ ప్రాంతాలను చుట్టేసిన కేటీఆర్ గత అర్ధరాత్రి కూడా నిద్రపోలేదు. కేటీఆర్ పర్యటన సందర్భంగా జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అర్ధరాత్రి అధికారులను వెంటబెట్టుకుని కేటీఆర్ ఖైరతాబాద్, సోమాజిగూడ, బంజారాహిల్స్ రోడ్ నెం.12 ప్రాంతాల్లోని బల్కాపూర్ నాలాను పరిశీలించారు. ప్రస్తుత వర్షాల వల్ల ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు జీహెచ్ఎంసీ, పోలీసు, ఇతర ప్రభుత్వ విభాగాలతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దించామని, వివిధ ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టామని, లోతట్టు ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. ఇలాంటి సమయాల్లో ప్రచారమయ్యే పుకార్లను నమ్మవద్దని ఈ సందర్భంగా ఆయన నగరవాసులకు సూచించారు.

More Telugu News