: తన ప్రాణాలు కాపాడుకొని మరో 8 మంది చిన్నారులను కాపాడిన బాలుడు

ప్రమాదానికి గురైతే ఎంతో గాబ‌రా ప‌డిపోతాం. మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవ‌డానికి చేసే ప్ర‌య‌త్నంలో ఎంతో ఆందోళ‌న చెందుతాం. మ‌న చుట్టూ ఉన్న‌వారిని ప‌ట్టించుకోం. మ‌న‌తో పాటు ఎవ‌ర‌యినా ప్ర‌మాదానికి గుర‌యితే ఇక వారి గురించి అసలే పట్టించుకోం. అయితే, అమృత్‌స‌ర్‌లో ఓ పదిహేనేళ్ల బాలుడు చేసిన సాహ‌సం గురించి వింటే అత‌డిని శ‌భాష్ అన‌కుండా ఉండ‌లేం. ప్రమాదం నుంచి త‌న‌ను తాను ర‌క్షించుకోవ‌డంతో పాటు, తనతో పాటు ప్ర‌మాదానికి గుర‌యిన ఎనిమిది మంది చిన్నారుల ప్రాణాలు కూడా కాపాడాడు. 11వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ కరణ్ బిర్ సింగ్ స్కూలు బస్సులో తోటి విద్యార్థుల‌తో ప్ర‌యాణిస్తున్నాడు. ఒక్క‌సారిగా బ‌స్సు ప్రమాదానికి గురై కాలువ‌లో ప‌డిపోయింది. అక్కడ త‌న‌ని తాను ర‌క్షించుకొని, బస్సులోంచి బ‌య‌ట‌కు రాలేక‌ సీట్ల కింద ఇరుక్కుపోయిన చిన్నారుల‌ను కాపాడాడు. క‌ర‌ణ్ బిర్ సింగ్ తాను చేసిన సాహ‌సం గురించి మీడియాతో మాట్లాడుతూ.. తాను కిటికీ పక్క సీట్లో కూర్చున్నట్లు చెప్పాడు. త‌మ స్కూల్ బ‌స్సు డ్రైవర్ నిబంధ‌న‌లు పాటించ‌కుండా బస్సును నడుపుతున్నాడని చెప్పాడు. బ‌స్సు వంతెనపైకి వ‌స్తోన్న స‌మ‌యంలో మలుపు ద‌గ్గ‌ర‌ కనీసం బ్రేకులు కూడా వేయలేదని క‌ర‌ణ్ బిర్ సింగ్ అన్నాడు. త‌న‌కు చాలా భయమేసిందని పేర్కొన్నాడు. అంతలోనే బస్సు ఒక్క‌సారిగా కాలువ‌లో పడిపోయిందని చెప్పాడు. ఎంతో భ‌యానికి గుర‌యిన తాను తేరుకునేసరికి త‌న‌ చుట్టూ నీరు ఉండ‌డాన్ని గ‌మ‌నించి, వెంట‌నే బ‌స్సు నుంచి బయటికి రావ‌డానికి ప్ర‌య‌త్నించి బ‌య‌టికి వ‌చ్చేసిన‌ట్లు తెలిపాడు. అనంత‌రం తాను సీట్ల క్రింద ఇరుక్కుపోయిన చిన్నారుల‌ను కాపాడిన‌ట్లు చెప్పాడు. తాను చిన్నారుల‌ను ఒక్కొక్కరినీ బయటికి తీస్తుండ‌గా స్థానికులు కూడా వ‌చ్చార‌ని, వారు మిగ‌తా వారిని కాపాడారని పేర్కొన్నాడు.

More Telugu News