: మంత్రివర్గంలోకి లోకేష్ రాకకే... 1న విస్తరణకు ముహూర్తం!

అక్టోబర్ 1, శనివారం నాడు ఏపీ మంత్రివర్గ విస్తరణ జరగనుందని, లోకేష్ ను చంద్రబాబు తన క్యాబినెట్ లోకి తీసుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ తెలుగుదేశం జాతీయ కమిటీలో కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన్ను క్యాబినెట్ లోకి తీసుకోవాలని చానాళ్ల నుంచే తెలుగుదేశం నేతలు, కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తుండగా, లోకేష్ జాతకం ప్రకారం, అక్టోబర్ 1 మంచి ముహూర్తమని, ఆ రోజు మంత్రివర్గాన్ని విస్తరించాలని పండితులు చెప్పినట్టు సీఎం కార్యాలయం వర్గాలు వెల్లడించాయి. వేద పండితుల సూచన మేరకు ఆ రోజునే విస్తరణ జరుగుతుందని తెలుస్తుండగా, అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇక పక్కనే ఉన్న తెలంగాణలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్, మంత్రిగా దూసుకెళుతుంటే, చంద్రబాబు కుమారుడు లోకేష్ కు ఆ స్థాయిలో పదవి లేకపోవడాన్ని చూసి చంద్రబాబు కుటుంబ సభ్యులే చిన్నబుచ్చుకున్నారని, లోకేష్ కు మంత్రి పదవి కోసం ఒత్తిడి తెస్తున్నారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక వైకాపా నుంచి ఫిరాయించిన వారిలో కొంతమందికి మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు చంద్రబాబు స్వయంగా హామీలు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూలను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు, ఇప్పటి ప్రాతినిధ్యం లేని ముస్లిం వర్గం నుంచి ఒకరిని చోటు లభిస్తుందని తెలుస్తోంది. ఇక కనీసం నలుగురు మంత్రులను తొలగించవచ్చని కూడా సమాచారం.

More Telugu News