: డ్రైవర్లు, రోజు కూలీలు... బెంగళూరు విధ్వంసకారులట!

కావేరీ నది నీటిని తమిళనాడుకు వదిలారంటూ, మూడు రోజుల క్రితం కన్నడిగులు ఉద్యమించి వందలాది వాహనాలకు నిప్పు పెట్టి, తీవ్ర విధ్వంసం సృష్టించిన వేళ, అల్లర్లకు కారకులంటూ పోలీసులు వందలాది మందిని అరెస్ట్ చేశారు. బెంగళూరు నగరవ్యాప్తంగా పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో అత్యధికులు మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్లు, పనివాళ్లు, రోజు కూలీలే కనిపిస్తుండటంతో, చేతులు దులుపుకునేందుకు పోలీసులు మొక్కుబడి అరెస్టులు చూపించారన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఒకవైపు బెంగళూరు విధ్వంసం వెనుక రాజకీయ కుట్ర ఉందని, ఓ పథకం ప్రకారం అల్లర్లు జరిగాయని, ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర దాగుందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక తమ వారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని, వారంతా అమాయకులని పోలీస్ స్టేషన్ల ముందు పడిగాపులు కాస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తన భర్తను అన్యాయంగా తీసుకెళ్లారని ఓ మహిళ ఆరోపించగా, గొడవల రోజు బయటకు కూడా వెళ్లని తన భర్తను పోలీసులు ఇంట్లోకి జొరబడి లాక్కెళ్లారని మరో మహిళ వాపోయింది. మరో మహిళ మాట్లాడుతూ, తాము బెంగళూరులో పుట్టి పెరిగినా, తమ కుటుంబాలు మాత్రం తమిళనాడు నుంచి వచ్చాయని చెబుతూ, అరెస్ట్ చేసిన తన భర్తను వెంటనే విడిపించాలని కోరింది. కాగా, నిబంధనల మేరకు వీరందరినీ నేడు కోర్టు ముందు హాజరు పరుస్తామని, విచారణ జరుగుతోందని పోలీసు అధికారులు వెల్లడించారు.

More Telugu News