: నాకు అనుమానం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ నాలో ధైర్యం నింపేవాడు!: కొరటాల శివ

'జనతా గ్యారేజ్' సినిమా కథకు ఎన్టీఆర్, మోహన్ లాల్ ఎంత ముఖ్యమో... మెకానిక్స్ కూడా అంతే ముఖ్యమని దర్శకుడు కొరటాల శివ తెలిపాడు. 'జనతా గ్యారేజ్' సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి రాలేకపోయిన మోహన్ లాల్ గారు అందరికీ ధన్యవాదాలు చెప్పమన్నారని అన్నారు. తన సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోరు, మ్యూజిక్ ప్రముఖ పాత్ర పోషించాయని, దానికి దేవీశ్రీప్రసాద్ కారణమని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాలో 'వికాస్' అనే పాత్ర తనకు చాలా ఇష్టమని, సమాజంలో అలాంటి వారిని చాలా మందిని చూశానని ఆయన అన్నారు. అలాంటి పాత్రకు, సినిమాకు ఆయువుపట్టైన పాత్రకు ప్రాణం పోసిన రాజీవ్ కనకాలకు ధన్యవాదాలని అన్నారు. అలాగే స్టోరీ విని తాను హీరోను పెళ్లి చేసుకోనా? అనే సందేహం వ్యక్తం చేసిన సమంత, తొలి రోజు షూటింగ్ లో మూడు నిమిషాల ఎమోషనల్ సీన్ ను అద్భుతంగా పండించారని, ఎన్టీఆర్ కు దీటుగా ఆమె ఎమోషన్ ను క్యారీ చేశారని ఆయన తెలిపారు. తక్కువ నిడివి గల పాత్ర అయినా ఎలాంటి భేషజాలు లేకుండా పోషించిన నిత్యామీనన్ కు ఆయన థాంక్స్ చెప్పారు. రెండేళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ కు ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఎంత ఉత్కంఠకు గురయ్యాడో, అంత ఆసక్తిగానూ ఈ సినిమాను పూర్తి చేశాడని అన్నారు. ఇది హిట్ అవుతుందా? అని అప్పుడప్పుడు తనకు అనుమానం వచ్చేదని, ఆ సమయంలో తనలో ధైర్యం నింపింది జూనియర్ ఎన్టీఆర్ అని శివ చెప్పారు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఆయన తెలిపారు. ఈ రోజు నుంచి ఈ సినిమాలో రెండు మంచి సీన్లు జత చేశామని, నేటి నుంచి అవి థియేటర్లలో ప్రదర్శితమవుతాయని ఆయన తెలిపారు.

More Telugu News