: బొజ్జ గణపయ్యకు భారీ లడ్డూలు... రికార్డులు!

మండపాలలో కొలువై ఉన్న గణనాథులకు భారీ పరిమాణంలో లడ్డూలను నైవేద్యంగా సమర్పించుకోవడం ఓ ట్రెండ్ గా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మండపాల నిర్వాహకులు ఈ ఏడాది కూడా భారీ లడ్డూలను భక్తితో సమర్పించుకున్నారు. విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాల మైదానంలో 72 అడుగుల భారీ వినాయకుడ్ని ఏర్పాటు చేశారు. భారీ గణనాథులకు భారీ స్థాయి లడ్డూలను తయారు చేసి అందించడంలో తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన భక్తాంజనేయ స్వీట్స్ కు మంచి పేరుంది. విజయవాడలో 72 అడుగుల గణనాథుడి కోసం ఈ ఏడాది భక్తాంజనేయ స్వీట్స్ నిర్వాహకులు ఉచితంగానే 30 వేల కిలోల లడ్డూని తయారు చేసి పంపించారు. ఆ లడ్డూను నిర్వాహకులు మండపంలో ఉంచారు. మూడు రోజుల పాటు గణపయ్య ముందు ఉంచి తర్వాత భక్తులకు ప్రసాదంగా అందించనున్నారు. ఇక విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో కొలువుదీరిన అతిపెద్ద గణనాథుడికి సురుచి స్వీట్స్ 12,500 కిలోల లడ్డూను అందించింది. ఇప్పటి వరకూ గుజరాత్ లోని అంబాజీ పట్టణంలో 2015లో ఏర్పాటు చేసిన 11,115 కిలోల లడ్డూనే గిన్నిస్ బుక్ లో రికార్డుగా నమోదై ఉంది. విశాఖ లడ్డూ దాన్ని చెరిపేయనుంది. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణనాథుడికి కూడా ఈ ఏడు 500 కిలోల లడ్డూను సురిచి సంస్థే అందించింది.

More Telugu News