: 'గెలాక్సీ నోట్ 7'తో రూ. 6,700 కోట్లు నష్టపోయిన శాంసంగ్!

ఇటీవల తాము మార్కెట్లోకి విడుదల చేసిన గెలాక్సీ నోట్ 7 ఫోన్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న వేళ, విక్రయించిన దాదాపు 25 లక్షల యూనిట్లను వెనక్కు తీసుకోవాలని శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఫోన్లకు చార్జింగ్ పెడుతుంటే, ఇవి పేలిపోతున్నట్టు పలు దేశాల్లో 'నోట్ 7'లను కొనుగోలు చేసిన వారి నుంచి ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ఫోన్ లేదా నగదును తిరిగి చెల్లిస్తామని శాంసంగ్ ప్రకటించింది. ప్రస్తుతం సంస్థ అధికారులు తమకు కలిగే నష్టాన్ని అంచనా వేస్తుండగా, దాదాపు బిలియన్ డాలర్లు (సుమారు రూ. 6,700 కోట్లు) నష్టం వాటిల్లవచ్చని అంచనా. గత నెలలో గెలాక్సీ నోట్ 7 ఫోన్లు విడుదల కాగా, రెండు వారాల వ్యవధిలో 35 ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. త్వరలో యాపిల్ ఐఫోన్ 7 మార్కెట్లోకి విడుదల కానున్న నేపథ్యంలో శాంసంగ్, తాను విక్రయించిన ఫోన్లను వెనక్కు తీసుకోవాల్సి రావడం బ్రాండ్ ఇమేజ్ కి కొంత విఘాతమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News