: ఆ పతకాన్ని తీసుకుని అతని కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టవద్దు: యోగేశ్వర్ దత్ గొప్ప మనసు

ప్రముఖ రెజ్లర్ 2012 లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్ అద్భుతమైన క్రీడాస్పూర్తితో భారత్, రష్యా ప్రజల మనసులు దోచుకున్నాడు. డోపింగ్ పరీక్షల్లో విఫలం కావడంతో రష్యా ఆటగాళ్లు పలువురు రియో ఒలింపిక్స్ లో పాల్గొనలేకపోయిన సంగతి తెలిసిందే. ఆ దేశం ఈ అవమానంలో ఉండగానే 2012 లండన్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో రజత పతకం సాధించిన బేసిక్ కుదుఖోవ్ డోపింగ్ లో విఫలమయ్యాడని ఫలితాలు వెల్లడయ్యాయి. 2012లో నిర్వహించిన పరీక్షలు 2016లో వెల్లడవ్వడం హాస్యాస్పదమయితే... బేసిక్ కుదుఖోవ్ 2013లో రష్యాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడడం ఇక్కడ గమనార్హం. దీంతో ఆ కుటుంబం ఆ విషాదం నుంచి ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య, ఒలింపిక్ యాంటీ డోపింగ్ కమిటీలు అతని నుంచి రజతపతకం తీసుకుని, ఆ ఒలింపిక్స్ లో కాంస్యపతకం గెలుచుకున్న యోగేశ్వర్ దత్ కు దానిని ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై యోగేశ్వర్ దత్ స్పందిస్తూ... బేసిక్ కుదుఖోవ్ మంచి రెజ్లర్ అని తెలిపాడు. డోపింగ్ ఫలితాలు ఇంత ఆలస్యంగా విడుదల కావడం, ఆయన భౌతికంగా లేకపోవడంతో ఆ పతకం తీసుకుని, ఆ కుంటుబాన్ని మరింత విషాదంలోకి నెట్టవద్దని, ఆ పతకం కుదుఖోవ్ కుటుంబం వద్ద ఉండడమే సముచితమని అభిప్రాయపడ్డాడు. ఈ సమయంలో మనమంతా మానవతాదృక్పథంతో నడచుకోవాలని ఆయన సూచించాడు. దీంతో యోగేశ్వర్ దత్ గొప్ప మనసుపై భారత్, రష్యా క్రీడాకారులు, అభిమానులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

More Telugu News