: రాత్రి 10 గంటల సమయంలో ఐఏఎస్ అధికారికి ఫోన్ చేసిన ప్రధాని!

ప్రధానమంత్రి స్వయంగా త్రిపురకు చెందిన ఓ ఐఏఎస్ అధికారికి చేసిన ఫోన్, ఆపై సదరు అధికారి స్పందించిన తీరును గురించి ఓ యువకుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అయింది. ఈ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం, జూలై 21 రాత్రి 10 గంటల సమయంలో పీఎం కార్యాలయం నుంచి త్రిపురలోని ఐఏఎస్ అధికారి (పేరును వెల్లడించలేదు)కి ఫోన్ వచ్చింది. ఇంత రాత్రి సమయంలో ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు చెప్పిన ఓ అధికారి, "ప్రధాని మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు" అని చెప్పాడు. సదరు అధికారి షాక్ నుంచి తేరుకునే లోపే నరేంద్ర మోదీ లైన్ లోకి వచ్చారు. ఆయన కూడా డిస్టర్బ్ చేసినందుకు క్షమించాలని కోరుతూ, తనకు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి మధ్య జరిగిన చర్చను వివరించి, వర్షాల కారణంగా త్రిపురను ఇతర రాష్ట్రాలతో కలిపే ఎన్ హెచ్ 208 (ఏ)ను వెంటనే పునరుద్ధరించాలని, పనులు దగ్గరుండి చూసుకోవాలని కోరారు. ప్రధానితో మాట్లాడిన తరువాత రాత్రంతా నిద్రపట్టని అధికారి, ఉదయం ఆఫీసుకు వెళ్లగానే, రోడ్ల మరమ్మతులకు అవసరమైన నిధులు మంజూరై ఉన్నాయి. ఆయన దెబ్బతిన్న హైవే వద్దకు వెళ్లేసరికి జేసీబీలు సిద్ధంగా ఉన్నాయి. ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో అధికారులు, కార్మికులు హుటాహుటిన పనులు జరిపి నాలుగు రోజుల్లో రహదారిని బాగు చేసేశారు. ఆపై రవాణా మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేసి అభినందనలు కూడా అందాయి. ఢిల్లీకి వచ్చినప్పుడు పీఎంఓకు వచ్చి మోదీని కలుసుకోవాలని కూడా ఆహ్వానం అందింది. ఈ ఐఏఎస్ అధికారి స్నేహితుడి కుమారుడు మొత్తం కథనాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది షేర్ మీద షేర్ తెచ్చుకుంటుండగా, కొందరు ఫేక్ పోస్ట్ అయ్యుంటుందని కూడా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

More Telugu News