: మనవాళ్లు 'రియో గోల్డ్ మెడలిస్టుల'ట!... క్రీడల మంత్రి వ్యాఖ్యపై జోకుల మీద జోకులు!

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో అత్యధికంగా విమర్శలకు గురైన వారిలో కేంద్ర కీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ ముందున్నారని చెప్పుకోవచ్చు. అథ్లెట్ సర్బానీ నందాకు శుభాకాంక్షలు చెబుతూ ద్యుతీ చంద్ చిత్రాన్ని పోస్ట్ చేయడం, దీపా కర్మాకర్ పేరుకు కర్మనాకర్ అని రాయడం వంటి పొరపాట్లతో నెటిజన్ల నోళ్లలో నానిన విజయ్ గోయల్, తాజాగా పీవీ సింధు, సాక్షీ మాలిక్ లను స్వర్ణ పతక విజేతలుగా మార్చేశారు. నిన్న ప్రధాని మోదీ పతక విజేతలను కలిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, "ప్రధాని ఇవాళ ఖేల్ రత్న, ధ్యాన్ చంద్, ద్రోణాచార్య అవార్డు విజేతలను కలుసుకున్నారు. వారిలో రియో గోల్డ్ మెడలిస్టులు పీవీ సింధు, సాక్షి మాలిక్ ఉన్నారు" అని కెమెరాల ముందు చెప్పారు. ఆ వెంటనే గోయల్ వ్యాఖ్యలు వైరల్ కాగా, నోరు జారిన ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. నోరు జారడంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ కు గట్టి పోటీ ఇచ్చేవారు ఇప్పటికి ఒకరొచ్చారని ఒకరంటే, ఓ కామెడీ షోను హోస్ట్ చేసేందుకు కపిల్ శర్మకు పోటీదారు లభించాడని మరొకరు వ్యాఖ్యానించారు. ఇక తనపై వస్తున్న విమర్శలపై గోయల్ స్పందిస్తూ, "ఒక్క మాట తప్పుగా మాట్లాడితే ప్రజలు దాన్నో ఇష్యూ చేస్తున్నారు. ఇది నా విషయంలో చాలాసార్లు జరిగింది. నా ఉద్దేశం మనవాళ్లు బంగారు పతకాలు సాధించిన వారితో సమానమేనని. ఎవరికి తెలుసు మనకూ భవిష్యత్తులో గోల్డ్ మెడల్స్ రావచ్చేమో!" అన్నారు.

More Telugu News