: పుస్త‌కం రాసే ఆలోచ‌న లేదు.. ఆట‌మీదే నా దృష్టి పెడ‌తా, రానున్న టోర్నమెంట్స్ కి ప్రణాళిక వేసుకుంటున్నా: పి.వి సింధు

ఒలింపిక్స్‌లో అంచ‌నాల‌కు మించి రాణించి భార‌త్‌కు ర‌జత ప‌త‌కంతో తిరిగొచ్చిన బ్యాడ్మింట‌న్ స్టార్‌, తెలుగు తేజం పి.వి సింధు తన కోచ్‌ పుల్లెల గోపిచంద్‌తో క‌లిసి ఓ న్యూస్ ఛాన‌ల్‌కి ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఒలింపిక్స్ 2020 కన్నా ముందు చాలా టోర్న‌మెంట్లు ఉన్నాయని, ముందు వాటిల్లో రాణించ‌డానికి ప్ర‌ణాళిక వేసుకుంటున్న‌ట్లు పేర్కొంది. వాటిల్లోనూ రాణిస్తానని తెలిపింది. ఒలింపిక్స్‌లో విజ‌యంతో త‌న‌పై బాధ్య‌త మ‌రింత పెరిగిందని తెలిపింది. తాను చాలా అదృష్ట‌వంతురాలినని, తాను బ్యాడ్మింట‌న్‌లో రాణించ‌డానికి అంద‌రి స‌పోర్ట్ ల‌భించిందని సింధు పేర్కొంది. ప్ర‌స్తుతం త‌న జీవితంపై, క్రీడారంగంలో త‌న‌కు ఎదుర‌యిన అనుభ‌వాల‌పై పుస్త‌కం రాసే ఆలోచ‌న త‌న‌కు లేద‌ని సింధు తెలిపింది. ఆట‌మీదే త‌న‌ దృష్టి పెడ‌తాన‌ని పేర్కొంది. త‌న‌కిప్పుడు 21 ఏళ్లు మాత్ర‌మేన‌ని వ్యాఖ్యానించింది. ఆడ‌పిల్ల‌లు దేశం గ‌ర్వ‌ప‌డే విధంగా ఎద‌గాలని చెప్పింది. ఈ సందర్భంగా పుల్లెల గోపిచంద్ మాట్లాడుతూ... ఒలింపిక్స్ బ‌రిలో దిగేముందు తన‌తో పాటు సింధు ఎన్నో త్యాగాలు చేసిన‌ట్లు, మెడ‌ల్ సాధించడం వంటి పెద్ద సక్సెస్ ముందు తాము చేసిన త్యాగం చిన్న‌బోయిన‌ట్లు పేర్కొన్నారు. ఎంతో మంది క్రీడాకారుల‌కు సింధు స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు. త‌ల్లిదండ్రులు త‌మ‌ చిన్నారుల్లో ఉన్న ఆస‌క్తిని గ‌మ‌నించాలని అన్నారు. సింధు మరిన్ని పతకాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News