: చేతలే మాట్లాడతాయి... పెన్నులను కూడా ఓడిస్తాయి: సింధును విమర్శిస్తే అమితాబ్ కు కోపం వచ్చింది

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కు కోపం వచ్చింది. ప్రముఖ రచయిత్రి, కాలమిస్టు శోభాడే పీవీ సింధును కూడా లక్ష్యం చేసుకోవడం అమితాబ్ కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన వ్యాఖ్యల చర్నాకోలుతో ఆమెకు సమాధానం చెప్పారు. రియో ఒలింపిక్స్ మహిళా బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్స్ లో పీవీ సింధు విజయం సాధించిన వెంటనే శోభాడే ట్విట్టర్ ద్వారా స్పందించారు. సింధును 'రజత పతక యువరాణి' (సిల్వర్ ప్రిన్సెస్)గా అభివర్ణించారు. దీంతో ట్విట్టర్ లో ఆమె ఫాలోయర్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో శోభా డే పదాలతో ఆడుకున్నాడు. సాక్షి మాలిక్ మెడలో కాంస్య పతకం 'శోభ'నిస్తే...సింధు స్వర్ణ పతకాన్ని 'దే' ('దే' అనే పదానికి, 'డే' అనే పదానికి రాతలో ఒకటే పదాలు) అంటోందని ట్వీట్ చేశాడు. అమితాబ్ బచ్చన్ మాత్రం ఆమె పేరు ఎత్తకుండానే... 'మీరు ఖాళీ చేతులతో రావడం లేదు... పతకాలతో వస్తున్నారు. మీరు మెడల్ తీసుకుని వస్తుంటే మేము మీతో సెల్ఫీలు తీసుకుంటున్నాము. మీరు అతిగా మీ ప్రత్యర్థులనే కాదు, అతిగా వాగే వాళ్లను కూడా ఓడించారు. మీ చేతలతో పెన్నులను కూడా ఓడించారు' అంటూ ఆయన సింధును ప్రశంసిస్తూనే, విమర్శకులకు చరకంటించారు. 'సింధు! మహిళా శక్తిని చాటావు...నిన్ను చూసి భారత దేశం గర్విస్తోంది' అని ఆయన అభినందించారు.

More Telugu News